సిద్ధిపేట : సీఎం కేసీఆర్ లేకపోతే స్వరాష్ట్రం తెలంగాణే లేదని, కాళ్వేరం, రంగనాయక సాగర్ ప్రాజెక్టులే ఉండేవి కాదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా రంగనాయక్ సాగర్ ఎడమ కాలువ ద్వారా రైతులకు గోదావరి నీటిని విడుదల చేసి, అనంతరం ప్రాజెక్టు కట్టపై కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కారణజన్ముడని, గొప్ప కార్యం కోసం పుట్టిన మహాత్ముడన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాకారం చేయడంతో పాటు ప్రజల ఆకాంక్షలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారన్నారు.
గుక్కెడు నీళ్ల కోసం తపించిన తెలంగాణను సమృద్ధిగా సాగు జలాలతో తెలంగాణ సస్యశ్యామలమైందన్నారు. అన్ని వర్గాలు, ప్రాంతాల అభివృద్ధి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన సహకారం రాకున్నా.. అత్యుత్తమ ఆర్థిక విధానాలతో తెలంగాణను అన్ని రంగాల్లో ముందంజలో నిలుస్తుందన్నారు. ఏడేళ్లలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా, దిక్సూచిగా నిలపారన్నారు. కేంద్రం అనేక కొర్రీలు పెడుతుందని, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆర్ఈసీ నుంచి అప్పుగా నిధులు రాకుండా అడ్డుపడుతుందని ఆరోపించారు. ఏడేళ్లలో తెలంగాణ జీఎస్డీపీనీ రెట్టింపు చేశారని, తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్‌గా నిలిపారన్నారు.