ఎన్నికల్లో గానీ, ఆటలోగానీ విజయం సాధిస్తే విక్టరీ అంటారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసినప్పడు హిస్టరీ అంటారు. కానే కాదు, రానే రాదు అన్నదాన్ని సాధించి చూపితే హిస్టరీనే అనాలి. ఇవాళ మన సీఎం కేసీఆర్ ఎన్ని హిస్టరీలు క్రియేట్ చేశారో అందరికీ తెలుసు.
Harish rao | సిద్దిపేట, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్, బీజేపీ వాళ్లు రాష్ట్ర ప్రభుత్వంపై పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. కొంతమంది సీఎం కేసీఆర్‌ను తిడుతున్నారని, కేసీఆర్‌ను తిట్టడం అంటే తినే కంచం లో ఉమ్మేసుకోవడమేనని అన్నారు. సిద్దిపేట నియోజకవర్గ సమావేశాన్ని రంగనాయకసాగర్ కట్ట వద్ద, గజ్వేల్ నియోజకవర్గ సమావేశాన్ని గజ్వేల్‌లో నిర్వహించారు. ఇందులో పలు తీర్మానాలు ప్రవేశపెట్టి, చర్చించి ఆమోదించారు. ఈసందర్భంగా మంత్రి మా ట్లాడుతూ.. ‘ఏం తక్కువ చేసిండు కేసీఆర్? ఊరూరికి డాక్లర్లను పంపి కంటి పరీక్షలు చే యించి కండ్లద్దాలు ఇచ్చిండు. పెద్ద కొడుకులాగా ఆసరా పెన్షన్, మేనమామ లాగా ఆడపిల్ల లగ్గానికి కల్యాణలక్ష్మి, పెద్దన్నలాగా ఎకరానికి 10 వేలు రైతుబంధు.. ఇలా ఎన్నో చేసిన కేసీఆర్‌ను తిట్టడానికి మీకు నోరెలా వస్తస్తున్నది’ అని మండిపడ్డారు. ‘ప్రజలంతా కేసీఆర్ వైపు ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఓట్ల కోసం ట్రిక్కులు కొడుతున్నారు. మీరు ఎన్ని ట్రిక్కులు కొట్టినా బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టేది ఖాయం’ అని స్పష్టంచేశారు.
మోదీకి, ఈడీకి భయపడే వ్యక్తికాదు
కేంద్రం వైఫల్యాలపై గట్టిగా మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌ను బీజేపీ బెదిరించాలని చూస్తున్నదని.. ఈడీ, సీబీఐకి కేసీఆర్ బెదిరే వ్యక్తి కాదని హరీశ్‌రావు స్పష్టంచేశారు. ప్రధాని మోదీ చేసే తప్పులను ఎత్తిచూపితే, అదానీకి కోట్లు దోచిపెట్టడాన్ని ప్రశ్నిస్తే చెడ్డవాళ్లయిపోతారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఎన్ని బెదిరింపులు వచ్చినా కేసీఆర్ వెనుకడుగు వేయలేదని, ఇప్పుడు మోడీలకు, ఈడీలకు బెదిరే ప్రశ్నే లేదని స్పష్టంచేశారు. మన బిడ్డ కేసీఆర్‌కు ఇక్కడి ప్రాంతంపై ప్రేమ ఉంటుంది తప్ప.. ప్రధాని మోదీకి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటదా? అని ప్రశ్నించారు.
చరిత్ర సృష్టించటం కేసీఆర్‌కు కొత్తేమీ కాదు
‘చరిత్రలో చాలా ఉంటాయి.. కొంతమంది చరిత్రను సిరాతో రాస్తారు. మరికొందరు రక్తం తో రాస్తారు.. ఇంకొందరు ఖద్దరు బట్టలతో రాస్తారు.. కేసీఆర్ కంటే ముందున్న సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి ఇనుప బూట్ల చప్పుళ్లతో రాశారు. కానీ, ఇవాళ కేసీఆర్ నాగలితో ఆకుపచ్చ చరిత్ర రాశారు. ఈ ఆకుపచ్చ చరిత్రకు సిరా కాళేశ్వరం నీళ్లు’.. అని హరీశ్‌రావు అన్నా రు. డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవి, పార్టీ పదవులను తృణప్రాయంగా వదిలేసి 2001లో కేసీఆర్ హిస్టరీ క్రియేట్ చేసిం డు. కేంద్ర మంత్రి పదవిని, మూడుసార్లు ఎంపీ పదవులను త్యాగం చేసి చరిత్ర తిరగరాసిండు. టీఆర్ఎస్ పార్టీని స్థాపించడం ఒక హిస్టరీ.. తెలంగాణ కోసం అన్నం ముద్ద ముట్టకుండా 11 రోజలు ఆమరణ నిరాహార దీక్ష చేయడం ఒక హిస్టరీ.. ఢిల్లీని కదిలించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన రాబట్టడం ఒక హిస్టరీ.. రెండుసార్లు తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం మరో హిస్టరీ.. తాజాగా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయడం మరో చరిత్ర కాబోతున్నది’ అని పేర్కొన్నారు.
ప్రభుత్వ విజయాలను ప్రచారం చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకా లు, సాధించిన విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు హరీశ్‌రావు సూచించారు. ‘నిజాన్ని రోజూ మాట్లాడా లి. నిజాన్ని ప్రచారంలో పెట్టాలి. ఒకవేళ నిజా న్ని ప్రచారంలో పెట్టకపోతే అబద్ధ్దం రాజ్యమేలుతది. అబద్ధ్దం రాజ్యమేలితే రాష్ర్టాలు, దేశా లు, ప్రపంచం నాశనమవుతాయి అన్న అంబేద్కర్ మాటను మనమంతా గుర్తుంచుకోవాలి.
ఫారెస్టు వర్సిటీ ఫైల్‌ను తొక్కిపెట్టిన గవర్నర్
సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధం గా ములుగుకు ఫారెస్టు యూనివర్సిటీ తెచ్చారని, గవర్నర్ 7 నెలలుగా వర్సిటీ ఫైల్‌ను తొక్కిపెట్టి నిన్న వాపస్ పంపారని హరీశ్‌రావు విమర్శించారు. గవర్నర్ అప్పుడే ఆమోదం తెలిపి ఉంటే వర్సిటీ ఇప్పటికే ప్రారంభమై ఉండేదని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీస్తున్నదని విమర్శించారు.