హైదరాబాద్/సిటీబ్యూరో, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): బూతులు తిట్టే నాయకులకు ప్రజలు పోలింగ్ బూత్‌లలోనే సమాధానం ఇస్తారని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలోని విపక్షాలకు ఎజెండా అంటూ లేదని, అందుకనే సీఎం కేసీఆర్‌ను, బీఆర్ఎస్ నేతల్ని వ్యక్తిగతంగా తిడుతున్నారని మండిపడ్డారు. టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. అసెంబ్లీలో ప్రస్తావించేందుకు సమస్యలేవీ లేకపోవడంతో విపక్ష నేతలు తమను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ నేతలను చెప్పుతో కొట్టాలని ఒక నేత అన్నారని, బూటుతో కొట్టాలని తాము అనగలమని కానీ, ప్రజలకు కావాల్సింది బూతులు మాట్లాడే నేతలు కాదని, భవిష్యత్తును బాగుచేసే వారని పేర్కొన్నారు. కార్యదక్షత కలిగిన సీఎం కేసీఆర్ చేతిలో ఉండటం వల్లే రాష్ట్రం నేడు అన్ని రంగాల్లోనూ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ 90 అమలు చేస్తారని పేర్కొన్నారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో కరువు, కర్ఫ్యూ, కులం, మతం, ప్రాంత వివక్ష లేదని, వాటర్ ట్యాంకర్ బిల్లులు లేవని, జనరేటర్ల చప్పుళ్లు లేవని వివరించారు.
ఈ మూడూ చూసుకొని ఓటెయ్యండి
గత పాలనకు.. నేటి పాలనకు తేడా, పొరుగు రాష్ర్టాల అభివృద్ధి.. మన రాష్ట్రంలోని అభివృద్ధి, కేంద్రం ప్రకటించే ర్యాంకులు, అవార్డులు.. ఈ మూడింటిని బేరీజు వేసుకుని ప్రజలు ఓటు వేయాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. దేశ జనాభాలో 3శాతం ఉన్న తెలంగాణకు కేంద్రం ఇచ్చే అవార్డుల్లో 30 శాతానికిపైగా రావడం కేసీఆర్ పాలనకు అద్దంపడుతున్నదని పేర్కొన్నారు. స్థానికంగా కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలు చేసిన మంచి పనులే పార్టీని గెలిపిస్తాయని అన్నారు. ఈ పదేండ్లలో లబ్ధిపొందిన లక్షలాదిమంది అండగా నిలుస్తారని తెలిపారు.
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటమే ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. ప్రతి ఇంటికి తాగునీరు అందించి ఆడబిడ్డల తిప్పలను తొలిగించాం. రాష్ట్రంలోని 13 లక్షల మంది ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ అందించాం. వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు 69 లక్షల మంది రైతులకు 11 విడతలుగా రూ.72వేల కోట్లు రైతుబంధు కింద పంపిణీ చేశాం. 34 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నాం. గ్రామాలు, పట్టణాల్లో అన్ని రకాల వసతులు కల్పించి వారి జీవన ప్రమాణాలను పెంచాం.
– మంత్రి హరీశ్‌రావు
గుణాత్మక మార్పు తెచ్చాం
పదేండ్ల సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ గుణాత్మక మార్పు తెచ్చామని హరీశ్‌రావు చెప్పారు. దేశంలో కోతలు లేకుండా కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. ఒకప్పుడు ఆకలి కేకలు వినిపించిన తెలంగాణ ఇప్పుడు పది రాష్ర్టాలకు అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందన్నారు. కర్ణాటక నుంచి డబ్బులు సంచులతో నేతలు వస్తుంటే, తెలంగాణ నుంచి కర్ణాటకకు బియ్యం వెళ్తున్నాయని తెలిపారు.
గ్రామాల్లో పల్లె దవాఖానలు, పట్టణాల్లో బస్తీ దవాఖానలు, నియోజకవర్గానికి ఒక 100 పడకల దవాఖాన, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, హైదరాబాద్ చుట్టూ నాలుగు టిమ్స్, 2 వేల పడకలతో నిమ్స్ విస్తరణ ఇలా అనేక సదుపాయాలు కల్పించామని చెప్పారు. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన తాగునీరు, రోడ్లు వంటి మెరుగైన సదుపాయాలను పల్లెలకు విస్తరించినట్టు చెప్పారు. ఐటీ ఉత్పత్తుల్లో, ఐటీ ఉద్యోగాల కల్పనలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. ఒకప్పుడు రాష్ట్రంలో 270 గురుకులాలు ఉంటే ఇప్పుడు వెయ్యి దాటాయని పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దు, కరోనా కారణంగా విద్య, వైద్య రంగాల్లో అనుకున్నంత పురోగతి సాధించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రధానంగా వీటిపైనే దృష్టిసారిస్తామని వివరించారు.
నియామకాలపై దుష్ప్రచారం
నియామకాల విషయంలో దుష్ప్రచారం జరుగుతున్నదని హరీశ్‌రావు అన్నారు. మొదటి విడతలో 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని, రెండో విడుతలో 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలు పెట్టామని చెప్పారు. గతంలో ఉద్యోగాలకు 60: 40 కోటా ఉండేదని, 40 శాతం ఓపెన్ కోటాలో ఇతర ప్రాంతాలవారు తన్నుకుపోయేవారన్నారు. అందుకే ఉద్యోగాలన్నీ తెలంగాణ బిడ్డలకే దక్కేలా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించామని, కొత్త జోనల్ వ్యవస్థ తెచ్చామని చెప్పారు. రెండేండ్లపాటు కరోనా ప్రభావం చూపడం, రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ కోసం ఏడాదిన్నర ఎదురు చూడాల్సి రావడంతో ఉద్యోగాల ప్రకటనలో కాస్త ఆలస్యం అయ్యిందన్నారు. ఇకపై రిటైరయ్యే ఉద్యోగుల స్థానాన్ని ఎప్పటికప్పుడు భర్తీచేస్తామని హామీ ఇచ్చారు. ప్రైవేట్ పరంగా పారిశ్రామిక రంగంలో 24 లక్షల ఉద్యోగాలు, ఐటీ రంగంలో 6 లక్షల ఉద్యోగాలు కల్పించామని వివరించారు.
బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యాయి
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయని హరీశ్‌రావు ఆరోపించారు. దుబ్బాక, మునుగోడులో బీజేపీకి కాంగ్రెస్ సహకరిస్తే, ఇప్పుడు కాంగ్రెస్‌కు బీజేపీ సహకరిస్తున్నదని అన్నారు. బీఆర్ఎస్ పథకాలను కాపీకొట్టి కాంగ్రెస్ మ్యానిఫెస్టో తయారుచేసినా.. దానికంటే బీఆర్ఎస్ మ్యానిఫెస్టోనే ఉత్తమంగా ఉందన్నారు. ఊరికి ఇద్దరు పైరవీకారులకు మేలు కలగాలంటే కాంగ్రెస్‌కు ఓటేయాలని, ఊరంతా మేలు కలగాలంటే కాంగ్రెస్‌కు ఓటేయాలని కోరారు. కేసీఆర్‌లాంటి పెద్దోళ్ల మీద పోటీచేసి తాము పెద్దవాళ్లు అవుతామనే భ్రమలో ఈటల, రేవంత్ రెడ్డి ఉన్నారని ఎద్దేవా చేశారు.
ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటింది. అధికారం కోసం రాజకీయాల్లోకి వస్తున్న పారిశ్రామిక, వ్యాపార, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో ధన ప్రవాహం పెరిగింది. దీనివల్ల ప్రజా సేవలో అంకితభావంతో పనిచేసిన నాయకులు వెనకబడిపోతున్నారు. ప్రజలు పరిణతితో ఆలోచించి ప్రజాస్వామ్యానికి పరిరక్షకులు ఉండాలి.
– మంత్రి హరీశ్‌రావు
నాపై 200కుపైగా కేసులు
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగసిపడుతున్న తరుణంలో సమైక్య పాలకులతో అంటకాగిన నీచ చరిత్ర రేవంత్‌రెడ్డిదని హరీశ్‌రావు దుయ్యబట్టారు. అలాంటి వ్యక్తి తనపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉన్నదన్నారు. ఉద్యమ సమయంలో తనపై 200కు పైగా కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. వచ్చే ప్రభుత్వంలోనూ వైద్యారోగ్యశాఖ మంత్రిగానే బాధ్యతలు చేపట్టాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టారు. ప్రజలకు ఎక్కువ సేవ చేసే అవకాశం, ఆత్మసంతృప్తి ఆ శాఖలోనే ఉన్నాయని మంత్రి హరీశ్‌రావు వివరించారు.
ఆర్టీసీ విలీనం ఆలస్యానికి బీజేపీనే కారణం
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ ఆలస్యానికి బీజేపీనే కారణమని హరీశ్‌రావు ఆరోపించారు. తాము పంపిన బిల్లు గవర్నర్ ఆపారని విమర్శించారు. చివరి నిమిషంలో ఆమోదం తెలిపినా గెజిట్ సిద్ధం చేసే లోగానే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు. గెజిట్ విడుదలకు ఇప్పటికీ సిద్ధంగా ఉన్నామని, అనుమతి కోసం ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశామని పేర్కొన్నారు. అనుమతి వచ్చిన మరుక్షణమే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు. మైనార్టీల ఓట్ల కోసమే బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నదని దుయ్యబట్టా రు. బీజేపీతో తమకు స్నేహం ఉంటే గవర్నర్ తమకు సహకరించి ఉండేవారన్నారు. బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టలేదన్న సాకుతో కేంద్రం రూ.30 వేల కోట్లు ఆపిందని విమర్శించారు. ప్రభుత్వం తరఫున సైనిక్ స్కూల్‌కు భూ కేటాయింపులు మూడేండ్ల కిందటే చేశామని, అయినా నిర్మాణానికి ఇప్పటికీ ఒక్క ఇటుక వేయలేదన్నారు. తెలంగాణకు ఇస్తామన్న సైన్స్ మ్యూజియం విషయంలోనూ భూ కేటాయింపులకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగానే ఉన్నదన్నారు. కానీ, మ్యూజియాన్ని బీజేపీ గుజరాత్‌కు తరలించుకుపోయి తెలంగాణను వంచించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వ్యవసాయానికి 24 గంటల కరెంటు సరఫరాపై కాంగ్రెస్ మాట్లాడటం సిగ్గుచేటు. దేశంలోని ఏ రాష్ట్రమైనా తెలంగాణ మాదిరిగా ఇస్తున్నదా? కర్ణాటకలో 5 గంటలు ఇస్తున్నామని చెప్పుకుంటున్నా, అక్కడ ఇస్తున్నది రెండుమూడు గంటలే. కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో ఏడు గంటలు మాత్రమే ఇస్తున్నారు. అలాంటివాళ్లకు మమ్మల్ని విమర్శించే హక్కు లేదు.
– మంత్రి హరీశ్‌రావు
హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరికలు
Harishrao
సంగారెడ్డి, ఆందోల్ నియోజకవర్గాల్లోని కాంగ్రెస్, బీజేపీకి చెందిన కీలక నేతలు మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బుధవారం బీఆర్ఎస్లో చేరారు. శివరాజ్‌పాటిల్ వందలాదిమంది అనుచరులతో తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. మంత్రి హరీశ్‌రావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరినవారిలో కాంగ్రెస్ ఉపసర్పంచ్ రమేశ్‌రెడ్డి, వార్డు సభ్యులు నర్సింలు, రత్నాకర్‌రెడ్డి, మనోజ్‌రెడ్డి, సదాశివపేట మండల బీజేవైఎం అధ్యక్షుడు అంజియాదవ్, మైనారిటీ అధ్యక్షుడు షేక్ మొబిన్ కబీర్, ఆయన అనుచరులు బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ ఇన్చార్జీ, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, నాయినేని రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.