సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 25: గ్రూప్-1లోనూ 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే రిజర్వ్ చేయటం గొప్ప విషయమని, ఈ ఘనత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకే దక్కుతుందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ క్యాడర్లో గతంలో ఉద్యోగాలు 60 శాతం స్థానికులకు, 40 శాతం నాన్‌లోకల్ వారికి ఉండేవాని వెల్లడించారు. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్ర గ్రంథాలయంలో విద్యార్థులకు పోటీ పరీక్షల మెటీరియల్ అందజేసి, మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని, నర్సింగ్ కళాశాలను మంత్రి హరీశ్ ప్రారంభించారు. అలాగే, ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని మలేరియాపై అవగాహన ర్యాలీని జెండా ఊపి ఆరంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 500కు పైగా గ్రూప్-1 ఉద్యోగాలు రాబోతుండటం చరిత్రలో ఇదే తొలిసారి అని వెల్లడించారు. కష్టపడే అభ్యర్థులకు అన్యాయం జరుగొద్దనే ఇంటర్వ్యూలు కూడా తీసేశారని చెప్పారు. భవిష్యత్తులో ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు.
నిరుద్యోగులకు మేలు జరిగేలా 317జీవోను తీసుకొస్తే, మంచీ చెడు చూడకుండా ప్రతిపక్షాలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. అవగాహన లేకుండా ఆ జీవోపై బండి సంజయ్ దీక్ష చేయటం హాస్యాస్పదమని అన్నారు. దేశంలో 15.65 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, అవి ఎప్పుడు భర్తీ చేస్తారో బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాము 91 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని, కేంద్రం కూడా భర్తీ చేస్తే మన పిల్లలకు లక్ష ఉద్యోగాలు దొరుకుతాయని అన్నారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక రైల్వే స్టేషన్లు, రైల్వే లైన్లను అమ్ముడు తప్ప.. రైల్వేలో ఒక్క ఖాళీని కూడా నింపలేదని ఆరోపించారు. రైల్వేలో 3 లక్షలు, ఆర్మీలో 3 లక్షలు, కేంద్రంలో 9.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు పార్లమెంట్ సాక్షిగా చెప్పారని, ఇవి ఎప్పుడు భర్తీ చేస్తారని బండి సంజయ్‌ను ప్రశ్నించారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల గురించి ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. ఆ ఖాళీలను భర్తీ చేస్తే పాలాభిషేకం చేస్తామని అన్నారు.
ఉద్యోగ సమాచారానికి జాబ్ స్పేస్ యాప్
జాబ్ స్పేస్ యాప్‌ను ప్రారంభించిన మంత్రి హరీశ్.. దేశంలో ఎక్కడ ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చినా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. గ్రంథాలయంలో సభ్యులుగా చేరితే నేషనల్ డిజిటల్ లైబ్రరీలోనూ సభ్యత్వం వస్తుందని విద్యార్థులకు సూచించారు. అందులో 20 లక్షల పుస్తకాలు చదివే వీలు ఉంటుందని తెలిపారు. లైబ్రరీకి వచ్చే ఉద్యోగార్థులందరికీ మధ్యాహ్న భోజనం అందిస్తామని వెల్లడించారు. అన్ని రకాల పోటీ పరీక్షల పుస్తకాలు అందిస్తున్నామని, ఉద్యోగార్థులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సిద్దిపేటలో ఉచిత కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తూ, ఉచిత శిక్షణ, మెటీరియల్ అందిస్తున్నామని వివరించారు.
సోషల్ మీడియాను వాడటం మానేసి కొన్ని రోజులు శ్రద్ధగా చదవాలని ఉద్యోగార్థులకు సూచించారు. ఎలాంటి అవసరం ఉన్నా డ్రాప్ బాక్స్ ద్వారా తనకు తెలియజేయాలని మంత్రి తెలిపారు. అనంతరం ఆకుల రజిత, వీ ప్రకాశ్ సొంత ఖర్చులతో అందించిన స్టడీ మెటీరియల్‌ను విద్యార్థులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.