హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విపక్ష పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏపీలో పోలవరం ప్రాజెక్టు పనులు మరో ఐదు సంవత్సరాలైన పూర్తి చేయలేరన్న మంత్రి.. పోలవరం పనుల పురోగతిపై అక్కడి ఇంజినీర్లతో మాట్లాడినట్లు చెప్పారు.
మరో ఐదేళ్లలో పూర్తయితే గొప్పేనని అధికారులు చెప్పినట్లు మంత్రి పేర్కొన్నారు. కాళేశ్వరం కంటే ముందే పోలవరం పనులు ప్రారంభించామని, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి ఆ ఫలితాలు తెలంగాణ ప్రజలకు అందుతున్నాయని, కేంద్రం చేపట్టిన జాతీయ ప్రాజెక్టు పోలవరం మాత్రం పూర్తి కాలేదని.. ఆ ఫలితం ప్రజలకు అందలేదని గుర్తు చేశారు. విపక్షాలు కాళేశ్వరంపై అబద్ధాన్ని పదేపదే చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. కాళేశ్వరం ఫలాలు అందుకుంటున్న వారంతా.. వాటిని తిప్పికొట్టి.. ప్రాజెక్టు గొప్పదనాన్ని చాటి చెప్పాలని రైతన్నలకు మంత్రి పిలుపునిచ్చారు.