Harish Rao | సంగారెడ్డి : జిల్లాలోని ఆందోళ్ నియోజకవర్గం పరిధిలోని జోగిపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ మంత్రి కారుమురి నాగేశ్వర్ రావు చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ వాసులకు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయి. రెండు ఓట్లు ఉంటే హైదరాబాద్‌లో ఉంచుకోవాలని చెప్పాను అని హరీశ్‌రావు గుర్తు చేశారు.
తెలంగాణలో ఏముందో వచ్చి చూస్తే తెలుస్తుందని కారుమురి నాగేశ్వర్ రావుకు హరీశ్‌రావు గట్టి కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో 56 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతోంది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. కల్యాణలక్ష్మి, రైతుబంధు అమలు చేస్తున్నాం అని తెలిపారు.
ప్రత్యేక హోదా అని అధికారంలోకి వచ్చి.. ఇప్పుడేమో దాని గురించి మాట్లాడటం లేదు. ప్రత్యేక హోదా కోసం ఆనాడు టీడీపీ ఎన్డీఏను వీడింది. అదే టీడీపీ ఇప్పుడు బీజేపీతో దోస్తీ కడుతోంది. రాజకీయాల కోసం ఏపీ ప్రజలను గాలికి వదిలేశారు. విశాఖ ఉక్కును తుక్కు కింద పెట్టినా మాట్లాడని పరిస్థితి ఉంది. అధికార పార్టీ అడగదు.. ప్రతిపక్షం ప్రశ్నించదు. రెండు పార్టీలు జనాన్ని గాలికి వదిలేసి స్వార్థం కోసం పని చేస్తున్నాయి. అనవసరంగా తమ జోలికి రాకండి.. తమ గురించి ఎక్కువ మాట్లాడకండి అని మంత్రి హరీశ్‌రావు సూచించారు.