Ajit Pawar : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ అంశంపై విచారణ చేపట్టిన వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. విమానంలో సాంకేతిక లోపంతోపాటు, ల్యాండ్ చేసే సమయంలో పొగమంచు కారణంగా సరిగ్గా కనిపించకపోవడం ప్రధాన కారణాలుగా తేలింది.
ఇవి ప్రాథమికంగా గుర్తించిన అంశాలే. పూర్తిస్తాయి విచారణ ఇంకా సాగుతున్నందున అసలైన కారణాలు తెలియాల్సి ఉంది. అలాగే ఈ అంశాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. విమానం ల్యాండ్ చేసే సమయంలో విజిబిలిటీ సరిగ్గా లేదు. దీంతో ల్యాండింగ్ విషయంలో పొరపాటు జరిగి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే విమానానికి సంబంధించి ఏదైనా సిస్టమ్‌లో పొరపాటు జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఎక్కడ సాంకేతిక లోపం తలెత్తిందో గుర్తించేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే విమానంలోని బ్లాక్ బాక్స్‌ను అధికారులు సేకరించి, అందులోని డాటాను విశ్లేషిస్తున్నారు. దీనికి సంబంధించిన నివేదిక త్వరలోనే అందనుంది.
ఈ డాటా ఆధారంగానే ప్రమాదానికి గల కారణాలు వెలుగుచూస్తాయని అధికారులు అంటున్నారు. ‘ద ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ)’ ఈ విచారణ చేపట్టింది. గత నెల 28న ముంబైనుంచి బారామతి వెళ్తున్న విమానం.. బారామతిలో ల్యాండింగ్ సమస్య కారణంగా ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తోపాటు మరో నలుగురు ఈ ప్రమాదంలో మరణించారు.