Minister Harish Rao | సంగారెడ్డి, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటున్నారని, వారికి అధికారం అప్పగిస్తే రేపు తెలంగాణను సైతం అమ్ముకుంటారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని నమ్మకుంటే రిస్కు అని, తెలంగాణను అభివృద్ధి పథంలో నడుపుతున్న ఏకైక లీడర్ కేసీఆర్‌ను గెలిపిస్తేనే రాష్ట్ర భవిష్యత్తు భద్రంగా ఉంటుందని చెప్పారు. సంగారెడ్డి జిల్లా అందోలులో మంగళవారం నిర్వహించిన నియోజకవర్గ బీఆర్ఎస్ బూత్‌స్థాయి ఇన్చార్జిల సమావేశంలో మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతికిరణ్, జడ్పీచైర్‌పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి, బీఆర్ఎస్ నేతలు ఫారూఖ్ హుస్సేన్, జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఓ అతుకుల బొంత అని విమర్శించారు. సంగారెడ్డి జిల్లాలో ఇద్దరు నేతలకు టికెట్ ఇప్పిస్తానని దామోదర రాజనర్సింహ మాట ఇచ్చి టికెట్ ఇప్పించలేదని, దీంతో పార్టీ అధిష్ఠానంపై అలిగారని పేర్కొన్నారు. పటాన్చెరు కాంగ్రెస్ టికెట్‌ను వందకోట్లకు అమ్ముకున్నారని సొంత పార్టీ నేతలే ఆందోళనలు చేస్తున్నారని గుర్తుచేశారు. సొంత పార్టీ నేతల దిష్టిబొమ్మలు, ఫ్లెక్సీలు దహనం చేయడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు.
కాంగ్రెస్‌లోని మరికొందరు నేతలు తమకు వందకోట్లు రాలేదని బాధపడుతున్నారని ఎద్దేవాచేశారు. ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటున్న కాంగ్రెస్‌కు అధికారం అప్పగిస్తే రాష్ర్టాన్ని ఆగం చేస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కాంగ్రెస్‌లో కుర్చీల కొట్లాట సాగుతుందని వెల్లడించారు. కాంగ్రెస్‌లోని 32 మంది నాయకులు సీఎం పదవి కోసం పోటీపడుతున్నట్టు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో ఒకరే లీడర్, ఒక్కరే సీఎం అదీ కేసీఆర్ అని తెలిపారు. తెలంగాణ కోసం అహార్నిశలు కష్టపడి పనిచేస్తున్న కేసీఆర్ వైపు ప్రజలు నిలబడాలని, హ్యాట్రిక్ సీఎంగా గెలిపించాలని కోరారు.
పదిసీట్లు గెలుస్తాం.. క్రాంతిని భారీ మెజార్టీతో గెలిపించాలి
ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ను గెలిపించటమే తన లక్ష్యం అన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రాబోయే 23 రోజుల చిత్తశుద్ధితో పార్టీ గెలుపుకోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. 11 సార్లు కాంగ్రెస్‌కు ఓటు వస్తే కాంగ్రెస్ కనీసం కరెంటు ఇవ్వలేదు, నీళ్లు ఇవ్వలేదు, రోడ్లు వెయ్యలేదని విమర్శించారు. ఇప్పుడు ఓటు వేస్తే రాష్ర్టాన్ని రిస్క్‌లో పడేసినట్టేనని హెచ్చరించారు. కర్ణాటకలో 5 గంటల కరెంటు ఇస్తున్నామని స్వయంగా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఒప్పుకొన్నారని, రేపు ఆ పార్టీ వస్తే మన రాష్ట్రంలోనే అదే పరిస్థితి వస్తుందని చెప్పారు.
సీఎం కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం, జిల్లా అభివృద్ది చెందిందని తెలిపారు. అందోలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతికిరణ్‌ను కార్యకర్తలు, ఓటర్లు భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇతర పార్టీ నేతలను గెలిపిస్తే వారు హైదరాబాద్‌కే పరిమితం అవుతారని తెలిపారు. అందోలు నియోజకవర్గంలో కాంత్రికిరణ్ను గెలిపిస్తామని బీఆర్ఎస్ బూతుస్థాయి ఇన్చార్జిలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో మంత్రి హరీశ్‌రావు ప్రత్యేకంగా ప్రతిజ్ఞ చేయించారు.