హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): చంపినోడే సంతాపం తెలిపినట్టు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం తీరు ఉన్నదని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసిన చిదంబరం ఆ ప్రకటనను వెనకి తీసుకున్న ఫలితంగానే ఉద్యమంలో పౌరులు ఆత్మబలిదానాలు చేసుకున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణపై చిదంబరానికి అవగాహన లేదని విమర్శించారు. పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్షకు, తెలంగాణకు సంబంధం ఏమిటని నిలదీశారు. పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తే తెలుగు వాళ్ల ఐక్యత కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం చేశారని అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కోసం ఉద్యమించినపుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? కేంద్రంలోని నెహ్రూ ప్రభుత్వం తాత్సారం చేయటం వల్లే కదా పొట్టి శ్రీరాములు చనిపోయింది? అని సూటిగా ప్రశ్నించారు. చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని చిదంబరానికి హితవు చెప్పారు. మద్రాసు రాష్ట్రం ఉండేదని, తెలంగాణ రాష్ట్రం లేదని చిదంబరం మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్నదని తెలిపారు. 1948 నుంచి 1956 వరకు హైదరాబాద్ స్టేట్ (తెలంగాణ) ఉన్న చారిత్రక విషయాన్ని చిదంబరం తెలుసుకోవాలని చురక అంటించారు. తెలంగాణ అప్పులు, ఆదాయంపై చిదంబరం దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉన్న ఆర్థిక క్రమశిక్షణ ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోనైనా ఉన్నదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆర్బీఐ నివేదికలు ఏం చెప్తున్నాయో తెలుసుకుంటే మంచిదని సూచించారు.
ఒక చాన్స్ అంటే నమ్మేందు కు తెలంగాణ ప్రజలు అమాయకులు కారని తేల్చిచెప్పారు. దమ్ముంటే చిదంబరం తన సొంత రాష్ట్రం తమిళనాడులో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాలని సవాల్ విసిరారు. సుదీర్ఘ పోరాటాలు చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని స్పష్టం చేశారు. ఎవరెన్ని ట్రికులు ప్లే చేసినా, ఎంతమంది వచ్చి దుష్ప్రచారం చేసినా తెలంగాణ ప్రజలు కేసీఆర్‌వైపే ఉన్నారని తేల్చిచెప్పారు.