సిద్దిపేట, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలాగా వ్యవహరిస్తున్నదని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. బడా పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్ల అప్పులు మాఫీ చేసిన మోదీ ప్రభుత్వం, రైతులు పండించిన వడ్లు కొనుగోలు చేయాలంటే నష్టాలు వస్తాయని మాట్లాడుతున్నదని మండిపడ్డారు. సిద్దిపేటలో గురువారం నిర్వహించిన మహాధర్నాలో హరీశ్‌రావు మాట్లాడారు. ‘మేం అడుగుతున్నది గొంతెమ్మ కోరిక కాదు. కొత్త ముచ్చట అసలే కాదు. పంజాబ్‌లో ఎట్లయితే మొత్తం ధాన్యాన్ని కొంటున్నరో తెలంగాణ నుంచి కూడా అట్లనే కొనాలి. బాయిల్డ్ రైస్ తీసుకో.. నూకలు తీసుకోం అంటున్నరు. యాసంగి వడ్లు క్వింటాల్‌కు 65 కిలోల బియ్యం కావాలని అడుగుతున్నరు. యాసంగి వడ్లు మరాడిస్తే అన్ని బియ్యం వస్తయా. 20 కిలోలు వస్తయ్. 20 కిలోలు ఇస్తం తీసుకో మరి..లేదంటే వడ్లు నువ్వే తీసుకొని బియ్యం పట్టించుకో’ అని కేంద్రానికి సూచించారు. ధాన్యం ఎగుమతి ఒక రైతు గానీ, రాష్ట్ర ప్రభుత్వంగానీ చేయలేదని, ఆ అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుందని తెలిపారు. గతేడాది బాయిల్డ్ రైస్‌ను ఎగుమతి చేసిన కేంద్రం, పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు చెప్పిందని విమర్శించారు. మోదీ అంటే మోదుడు.. బీజేపీ అంటే బాదుడు.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్, మంచి నూనె, మందుల ధరల.. ఇలా అన్ని మోదుడే’ అని ఆరోపించారు. కేంద్రం వడ్లు కొనేదాకా పోరాటం ఆగదని స్పష్టంచేశారు.
ప్రభుత్వం కాదు.. వ్యాపార సంస్థ ..!
కేంద్రంలో ఉన్నది ప్రభుత్వం కాదు. అది ఒక వ్యాపార సంస్థగా వ్యవహరిస్తున్నది. వ్యవసాయ రంగాన్ని అదానీకో, అంబానీకో అప్పగించాలని చూస్తున్నది. రైతులు ధైర్యం చెడొద్దు. మనకు సీఎం కేసీఆర్ అండగా ఉన్నారు. యాసంగి వడ్లు కొనకుంటే రైతుల పక్షాన ఎంత వరకైనా పోరాడేందుకు సిద్ధం. కేంద్రాన్ని మనం భిక్షం అడుక్కొంటలేం. రాజ్యాంగ పరంగా రావాల్సిన హక్కుల కోసం పోరాడుతున్నా.
– కరీంనగర్ మహాధర్నాలో మంత్రి గంగుల కమలాకర్
కేంద్రానిది శకుని పాత్ర
తెలంగాణ పోరాటాల గడ్డ, పోరాటంతోనే రాష్ర్టాన్ని సాధించుకొన్నాం. రైతులకు కేంద్రం అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోం. తెలంగాణ పట్ల కేంద్రం శకునిలా వ్యవహరిస్తున్నది. కేంద్రం వడ్లు కొనేవరకు ఉద్యమం కొనసాగుతుంది.
– వికారాబాద్ మహాధర్నాలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి
బీజేపీని ప్రజలు తరిమికొట్టుడు ఖాయం
రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించడం ఖాయం. రైతులు కష్టపడి పండించిన వడ్లను కేంద్రం కొనకపోతే బీజేపీ నాయకులు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. బాజాప్తా వడ్లు కొంటామని చెప్పిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? బీజేపీ నేతలకు దమ్ముంటే కేంద్రంతో వడ్లు కొనిపించాలి.
– మేడ్చల్ మహాధర్నాలో మంత్రి మల్లారెడ్డి
మోదీ సార్.. రైతులతో రాజకీయం చేస్తుండు
ఎలచ్చన్ల్లో గెలవడానికి రాజకీయాలు చేయాలి కానీ దేశానికి బుక్కెడు బువ్వ పెట్టే రైతులతో ప్రధాని మోదీ సార్ రాజకీయం చేస్తున్నడు. అప్పులు తీర్చడానికి పట్నం పోయిన. కాలం బాగా అయ్యిందని బోర్లల్లో నీళ్లు కూడా వస్తున్నాయంటే కంపెనీలో పని బంద్ చేసి వ్యవసాయ చేద్దామని రెండేండ్ల క్రితం ఊళ్లకు వచ్చిన. ఈ సారి వరి పెడుదామనుకున్న. మోదీ బియ్యం కొనను అని కిరికిరి పెడుతుండని టీవీలు, పేపర్లలో చూసి చానా బాధపడ్డా. అప్పట్ల నీళ్లు, కరెంట్ లేక వ్యవసాయం చేయడానికి చానా తిప్పలు పడ్డాం. ఇప్పుడు మస్తు నీళ్లు, కరెంటు ఉన్నా వ్యవసాయం చేయకుండా మోదీ రైతుల నోట్ల మట్టి కొడుతున్నడు. తెలంగాణలో కరెంటు, నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. మేము బరాబర్ వరే పండిస్తాం.
– మల్లయ్య, రైతు, కొత్తగూడెం, సంస్థాన్, నారాయణపురం మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా
బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయ్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. తెలంగాణ ప్రజలు కన్నెర్రజేస్తే బీజేపీ ప్రభుత్వం గద్దె దిగటం ఖాయం. తెలంగాణ రైతులను, మంత్రులను నూకలు తినాలని కేంద్ర మంత్రి గోయల్ అవమానించారు. బీజేపీ నాయకులకు నూకలు తినే పరిస్థితి వస్తుంది. తెలంగాణ రైతుల వెనక కేసీఆర్ ఉన్నారు. బీజేపీ నాయకులు గవర్నర్‌ను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు.
– సంగారెడ్డి మహాధర్నాలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్.
కేంద్రం మెడలు వంచైనా ధాన్యం కొనిపించాలి
బీజేపీ ప్రభుత్వం తన తప్పు తెలుసుకొని తెలంగాణ రైతులు పండించిన యాసంగి వడ్లను కొనేవరకు ఉద్యమం ఆగదు. రైతుల అభివృద్ధి చూసి ఓర్వలేక బీజేపీ ప్రభుత్వం రైతులను ఇబ్బందిపెడుతున్నది. రైతులకు అన్యాయం చేసి, అదానీ, అంబానీలకు దేశ సంపదను దోచి పెడుతున్నది. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనిపించే బాధ్యత నాదే అన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?