హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాలను బలహీనపర్చేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ అంతులేని కుట్రలు చేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. మొత్తం పన్నుల వాటాలో రాష్ర్టాలకు 41 శాతం పంచాల్సి ఉండగా, నరేంద్రమోదీ ప్రభుత్వం 29.6 శాతమే ఇస్తున్నదని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అబద్ధాలనే పదేపదే చెప్పి నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పాదయాత్ర సందర్భంగా బండి సంజయ్ చెప్పేవన్నీ అబద్ధాలేనని గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో పోతున్నది ఎంత? కేంద్రం నుంచి వస్తున్నది ఎంత? అని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అడిగిన సూటి ప్రశ్నకు బండి సంజయ్ సమాధానం చెప్పకుండా డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
శనివారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, చంటి క్రాంతికిరణ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఆర్థిక మంత్రిగా కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన నిధుల లెక్కలను నేను ఆధారాలతోసహా చెప్తున్నా. అవి తప్పయితే నేను ముక్కు నేలకు రాస్తా. బండి సంజయ్.. నువ్వు చెప్పే లెక్కలన్నీ తప్పు అని నిరూపిస్తే నువ్వు ముక్కు నేలకు రాస్తావా?’ అని హరీశ్‌రావు సవాలు విసిరారు. తమది సంక్షేమ ప్రభుత్వమైతే, కేంద్రానికి సతాయించే ప్రభుత్వమని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్యాంధ్రవాదుల వాదనలాగే ఇప్పుడు బీజేపీ నేతల వాగుడు ఉన్నదని ఆయన ఎద్దేవాచేశారు.
పారిపోతున్న ఆర్థికవేత్తలు
బీజేపీ అంటే భారతీయ ఝూటా పార్టీ, బుల్డోజర్ జనతా పార్టీ, బురద జల్లే పార్టీ, భాషణ్ జ్యాదా (మాటలెక్కువ.. చేతలు తక్కువ) పార్టీ అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వం నియమించుకొన్న ఆర్థికవేత్తలే కేంద్రం విధానాలు బాగాలేవని, తామెంత చెప్పినా వృథా అవుతున్నదని ఆవేదనతో బయటికి వస్తున్నారని తెలిపారు. అరవింద్ సుబ్రమణ్యం, పణగారియా, కృష్ణమూర్తి, ఉర్జిత్ పటేల్, రఘురామ్ రాజన్.. ఇలా ఎంతోమంది వెళ్లిపోయారని గుర్తుచేశారు. ఇప్పటికైనా బొంకుడు మాటలు, ఝూటా మాటలను బంద్ పెట్టాలని బండి సంజయ్‌ని హెచ్చరించారు.
గద్వాలలో సౌకర్యాలు రాయచూర్‌లో ఎందుకు లేవు?
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి మొత్తం కేంద్రం నిధులతోనే నడుస్తున్నాయని బండి సంజయ్ పదేపదే చెప్పటాన్ని మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. ‘అంతా కేంద్రమే ఇస్తే తెలంగాణలో పల్లెలు, పట్టణాలు మెరిసినట్టు దేశమంతటా ఎందుకు మెరువటం లేదు. అన్ని పల్లెల్లో ట్రాక్టర్లు, ట్యాంకర్లు, ట్రాలీలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంప్‌యార్డులు ఎందుకు లేవు? బండి సంజయ్.. గద్వాలలో పాదయాత్ర చేస్తున్నారు కదా.. దమ్ముంటే పక్కనే ఉన్న రాయచూర్ పల్లెలకు వెళ్లి చూడు. రైతు వేదికలు, శ్మశాన వాటికలు.. ఇలా అన్నీ కేంద్రమే ఇస్తే తెలంగాణ పల్లెల్లా కర్ణాటకలో ఎందుకు మారలేదు.
ఎప్పుడు రమ్మంటారో చెప్పండి.. టైమ్, డేట్ మీరే ఫిక్స్ చేయండి.. నేను వస్తా. కర్ణాటక పల్లెలను చూద్దాం’ అని సవాలు విసిరారు. రాయచూర్ వాసులు వచ్చి తమకూ తెలంగాణలో ఉన్నట్టు పథకాలు కావాలని బండి సంజయ్‌కి లేఖ ఇచ్చింది నిజం కాదా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టినట్టు రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, ఆసరా ఫించన్లు, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ వంటివన్నీ తమకూ ఇవ్వాలని కర్ణాటక సీఎం బస్వరాజు బొమ్మైకి చెప్పాలని కోరింది వాస్తవం కాదా? అని నిలదీశారు. ఈ సందర్భంగా బండి సంజయ్, డీకే అరుణకు రాయచూర్ వాసులు వినతిపత్రం ఇస్తున్న వీడియోను హరీశ్‌రావు ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతికి రూ.4,797 కోట్లు, పట్టణ ప్రగతికి రూ.2,288 కోట్లు ఖర్చుచేసిందని, ఇందులో కేంద్రం డబ్బు నయాపైసా లేదని స్పష్టంచేశారు.
రాష్ర్టాలను బలహీనపర్చే కుట్ర
పన్నుల వాటాలో రాష్ర్టాలకు కేంద్రం తీరని అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. రాష్ర్టాలకు 41 శాతం పంచాల్సి ఉండగా, మోదీ ప్రభుత్వం 29.6% మాత్రమే ఇస్తున్నదని విమర్శించారు. పెట్రోల్, డీజిల్‌పై సెస్‌లు విపరీతంగా పెంచిందన్నారు. ధరల పెంపును 15వ ఆర్థిక సంఘం తప్పుబట్టినా కేంద్రానికి సిగ్గు రాలేదని ధ్వజమెత్తారు. సెస్‌ల రూపంలో 11.4% కేంద్రం వసూలు చేస్తున్నదని, వీటిని రాష్ర్టాలకు ఎందుకు ఇవ్వడంలేదని నిలదీశారు. రాష్ర్టానికి హక్కుగా రావాల్సిన రూ.7,183 కోట్ల నిధులనే కేంద్రం ఇవ్వట్లేదని మండిపడ్డారు. వీటిని విడుదలచేయాలని ప్రధాని మోదీకి, ఆర్థిక మంత్రికి సీఎం కేసీఆర్ అనేక ఉత్తరాలు రాసినా, స్వయంగా కలిసి విన్నవించినా పట్టించుకోలేదని ఆరోపించారు.
తెలంగాణపై ప్రేమ ఉంటే తక్షణమే ఈ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2014లో రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తెలంగాణకు రావాల్సిన రూ. 454 కోట్లను కేంద్రం తప్పుగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిందని, వీటిని తిరిగి ఇప్పించాలని ఏడేండ్లుగా అడుగుతున్నా అతీగతీ లేదని మండిపడ్డారు. పొద్దున లేచింది మొదలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆడిపోసుకొనే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బకాయి నిధులు రూ.7,183 కోట్లు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి రాష్ర్టానికి 3 లక్షల కోట్లకుపైగా ఇచ్చామని బండి సంజ య్ చెప్పుకోవడం బంద్ చేయాలని హరీశ్‌రావు డి మాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు 2014 నుంచి ఇప్పటివరకు పన్నుల రూపంలో రూ.3,65,797 కోట్లు కేం ద్రానికి కట్టారని, కేంద్రం నుంచి రాష్ర్టానికి రూ. 1,68,647 కోట్లు మాత్రమే వచ్చాయని స్పష్టంచేశారు.
ఆర్డీఎస్కు అరుణ పేరా?
ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్)కు డీకే అరుణ పేరు పెడుతానని బండి సంజయ్ నిస్సిగ్గుగా ప్రకటించడంపై నడిగడ్డ ప్రజలు నవ్వుకొంటున్నారని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. పదేండ్లు మంత్రిగా, 15 ఏండ్లు ఎమ్మెల్యేగా ఉన్న డీకే అరుణ, ఆర్డీఎస్ సమస్య పరిష్కారానికి ఏం చేశారో ఆమెనే అడగాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో రాయలసీమ నేతలు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, బాలనాగిరెడ్డి లాంటి వాళ్లు బాంబులు పెట్టి ఆర్డీఎస్ తూములు బద్దలు కొడితే, రాష్ట్ర మంత్రిగా ఉండి నోరువిప్పని వ్యక్తి డీకే అరుణ కాదా? అని ప్రశ్నించారు. ఆర్డీఎస్‌పై పోరాడింది టీఆర్ఎస్ అని, మొదటి పాదయాత్ర చేసింది సీఎం కేసీఆర్ అని గుర్తుచేశారు. పోతిరెడ్డిపాడుకు పొక్కగొట్టి నీళ్లన్నీ రాయలసీమకు తీస్కపోతే ఆనాడు మంత్రిగా ఉండి అనంతపురం జిల్లాలో రఘువీరారెడ్డికి హారతులిచ్చింది డీకే అరుణ కాదా? అని ఆయన ప్రశ్నించారు. కర్ణాటకలోని అప్పర్ భద్ర, బుందేల్‌ఖండ్‌లోని కెన్-బెత్వాకు జాతీయ హోదా ఇచ్చి తెలంగాణ ప్రాజెక్టులకు ఎందుకు ఇవ్వరని నిలదీశారు. గద్వాల దవాఖాన గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీ నేతలకు లేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు.
మంత్రిగా పనిచేసిన డీకే అరుణ గద్వాల దవాఖానను ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. గద్వాలలో ఐసీయూ, డయాలసిస్ సెంటర్, నర్సింగ్ కాలేజీ ఎవరు పెట్టారని నిలదీశారు. రూ.50 కోట్లతో 300 పడకల దవాఖానను ఎవరు మంజూరు చేశారని బండి సంజయ్‌ని ప్రశ్నించారు. వాస్తవాలను వక్రీకరించటమే బీజేపీ పనిగా పెట్టుకున్నదని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అడవులు పెంచుతుంటే, కేంద్రం వంటగ్యాస్ ధరలు పెంచి ప్రజలు మళ్లీ వంటకోసం అడవులు నరికేలా చేస్తున్నదని ఆరోపించారు. తాము ఉద్యోగాలు భర్తీచేస్తుంటే, కేంద్రం ఉన్న ఉద్యోగులను ఇంటికి పంపుతున్నదని విమర్శించారు.
కేంద్రం తీసుకున్నది కొండంత.. ఇచ్చింది పిసరంత
బీజేపీ అంటే భారతీయ ఝూటా పార్టీ, బుల్డోజర్ జనతా పార్టీ, బురద జల్లే పార్టీ, భాషణ్ జ్యాదా (మాటలెక్కువ.. చేతలు తక్కువ) పార్టీ. మోదీ ప్రభుత్వం నియమించుకొన్న ఆర్థికవేత్తలే కేంద్రం విధానాలు బాగాలేవని, తామెంత చెప్పినా వృథా అవుతున్నదని ఆవేదనతో బయటికి వస్తున్నారు. అరవింద్ సుబ్రమణ్యం, పనగరియా, కృష్ణమూర్తి, ఉర్జిత్ పటేల్, రఘురామ్ రాజన్, రాజీవ్‌కుమార్.. ఇలా ఎంతోమంది వెళ్లిపోయారు. ఇప్పటికైనా బొంకుడు మాటలు, ఝూటా మాటలను బండి సంజయ్ బంద్ పెట్టాలి.
రాష్ర్టాలను బలహీనపర్చేందుకు కేంద్రప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. పన్నుల వాటాలో రాష్ర్టాలకు తీరని అన్యాయం చేస్తున్నది. పన్నుల రూపంలో వచ్చే మొత్తం దేశ ఆదాయంలో రాష్ర్టాలకు 41 శాతం పంచాల్సి ఉండగా, మోదీ ప్రభుత్వం 29.6 శాతమే ఇస్తున్నది. బీజేపీ అధికారంలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్‌పై సెస్‌లు విపరీతంగా పెరిగాయి. ధరల పెంపును 15వ ఆర్థిక సంఘం తీవ్రంగా తప్పుబట్టినా కేంద్రానికి సిగ్గు రాలేదు. సెస్‌ల రూపంలో 11.4 శాతం కేంద్రం వసూలు చేస్తున్నది. వీటిని రాష్ర్టాలకు ఎందుకు ఇవ్వడం లేదు?
ఆసరా పెన్షన్లలో కేంద్రానిది పిసరంతే
ఇప్పటివరకు ఆసరా పెన్షన్లపై రాష్ట్ర ప్రభుత్వం రూ.48,273 కోట్లు ఖర్చు పెడితే, ఇందులో కేంద్రం రూ.1,645 కోట్లు మాత్రమే ఇచ్చిందని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. మొత్తం నిధుల్లో ఇది 3.4 శాతం మాత్రమేనని తెలిపారు. 96.6 శాతం రాష్ట్ర నిధులేనని, అయినా బీజేపీ నేతలు పదేపదే అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. కేంద్రమే మొత్తం ఇస్తే దేశంలోని అన్ని రాష్ర్టాల్లో పెన్షన్లు రూ.2,016, రూ. 3,016 ఎందుకు ఇవ్వటం లేదని నిలదీశారు.