సంగారెడ్డి : పరిపాలన వికేంద్రీకరణ జరగాలని, పాలన ప్రజలకు చేరువ కావాలని సీఎం కేసీఆర్ ఆకాంక్ష. అందులో భాగంగానే కొత్త జిల్లాలు, గ్రామాలు, మండలాలను ఏర్పాటు చేశారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి అన్నారు. కాంగ్రెస్ పాలనలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉచిత కరెంట్ అన్నడు. అది ఉత్త కరెంట్ అయ్యింది. నాడు కాలిపోయే మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్ ఫార్మర్లు మాత్రమే దర్శనమిచ్చేవని ఆ పార్టీపై మండిపడ్డారు.
మంగళవారం జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గం, తడ్కల్ మండలంలో మైనార్టీ ఫంక్షన్ హాల్‌ను ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు గులాబీ పార్టీలో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..30 ఏండ్ల మండం ఏర్పాటు కలను నిజం చేసింది సీఎం, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు.
స్వరాష్ట్రంలో నారాయణ్ ఖేడ్ రూపురేఖలు మారిపోయాయని చెప్పారు. రెవెన్యూ డివిజన్ అయింది. కొత్త మండలాలు అయ్యాయి. 100 కొత్త గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. మొత్తం 223 గ్రామ పంచాయతీలు అయ్యాయి. రెవెన్యూ డివిజన్ల సంఖ్యను 43 నుంచి 74 వరకు, మండలాల సంఖ్యను 459 నుంచి 612 వరకు, గ్రామ పంచాయతీల సంఖ్యను 12,769 వరకు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
కాంగ్రెస్ నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్న మంత్రి
కాంగ్రెస్ జూటా మాటలు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను నమ్మితే కుక్క తోక వంకరే అన్న చందంగా ఉంటుందని పేర్కొన్నారు. కర్ణాటకలో ఉచిత బస్సు అన్నారు. ఉన్న బస్సు బంద్ పెట్టారు. కాంగ్రెస్ నాలుగు వేలు పింఛన్ కర్ణాటకలో ఇచ్చి మాట్లాడాలని డిమాండ్ చేశారు. కన్నతల్లికి అన్నం పెట్టలేనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తడటని ఎద్దేవా చేశారు.
భుజాలు నొప్పి పెట్టేలా నాడు మహిళలు నీళ్లు మోసారు. నేడు ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చింది కేసీఆర్. లక్ష రూపాయల రుణమాఫీ కొనసాగుతున్నది. అర్హులందరికీ మాఫీ అవుతాయని చెప్పారు. మాట చెబితే మడమ తిప్పని పార్టీ బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ను మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.