Harish Rao | సంగారెడ్డి : మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందం బట్టబయలు అయిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సదాశివపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనబిన్ ఫౌండేషన్ నేత ముఖీమ్ తన మద్దతుదారులతో బీఆర్ఎస్లో చేరగా, ఆయనకు హరీశ్‌రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. అన్న, తమ్ముడు చెరొక పార్టీలో ఉంటూ.. ఇన్నాళ్లు అన్న బీజేపీకి, తమ్ముడు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చినా ఏ పార్టీ కూడా చర్యలు తీసుకోలేదన్నారు. రెండు పార్టీలు కలిసి, తెలంగాణ బిడ్డను ఓడించాలని ప్లాన్ చేశాయన్నారు. సిద్ధాంతం లేని పార్టీలను తెలంగాణ ప్రజలు నమ్మరు అని స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి రోజు మాట్లాడుకొని పని చేస్తున్నారని పేర్కొన్నారు. కిషన్ రెడ్డి మరికొందరిని కాంగ్రెస్ పార్టీలోకి పంపే యత్నం చేస్తున్నారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి బీజేపీ సరెండర్ అయిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. దీంతో కషాయానికి, కాంగ్రెస్‌కు మధ్య ఉన్న బంధం బట్టబయలు అయిందన్నారు. కేసీఆర్‌ను తట్టుకోలేక, బీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీ కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు. ముఖీమ్ సహకారంతో సంగారెడ్డిలో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఆయన కోరిక మేరకు సదాశివపేటలో ఇంటి స్థలాలు లేనివారికి స్థలాలు ఇస్తామన్నారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అని స్పష్టం చేశారు. సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన జగ్గారెడ్డి.. ఏ ఒక్క రోజు కూడా నియోజకవర్గంలో పర్యటించలేదని హరీశ్‌రావు పేర్కొన్నారు.