Harish Rao | సిద్దిపేట : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. రాహుల్ అజ్ఞాని అంటూ ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఖర్చు చేసింది కేవలం రూ. 80 వేల కోట్లు మాత్రమే.. లక్షల కోట్లు ఖర్చు చేశారని రాహుల్ వ్యాఖ్యానించడం ఆయన అజ్ఞానానికి నిదర్శనం అని హరీశ్‌రావు మండిపడ్డారు.
సిద్దిపేట కేంద్రంలోని పత్తి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన తుంపర సేద్య పరికరాల పంపిణీ, ఆయిల్ పామ్ సాగు అవగాహన సదస్సులో మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి మెదక్ జిల్లాకు 500 స్ర్పింకర్లు మాత్రమే ఇచ్చేవారు.. కానీ తెలంగాణ వచ్చాక ఇప్పుడు 15,000 స్ర్పింకర్లు ఇస్తున్నామని తెలిపారు.
వర్షాభావ పరిస్థితులు తలెత్తితే కాలేశ్వరం ద్వారా రైతులకు నీళ్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ సూచించారని హరీశ్‌రావు పేర్కొన్నారు. రైతులు ఇబ్బంది పడొద్దు అని సీఎం చెప్పారు. కాబట్టి వ్యవసాయానికి సరిపడా నీరందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వ్యవసాయ బావుల వద్ద ఒక్క మీటర్ మీద రూ. 25,000 కరెంట్ బిల్లును ప్రభుత్వం భరిస్తుందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ రాహుల్ గాంధీ అనడం సరికాదన్నారు. బట్ట కాల్చి మీద వేస్తున్నారు.. ఏం పని చేయలేదా? అని ప్రశ్నించారు. వచ్చి చూస్తే తెలుస్తుంది.. కాళేశ్వరం ప్రాజెక్టు అయిందా..? లేదా? అన్న విషయం తెలుస్తుందన్నారు. కాళేశ్వరం పూర్తయితేనే కదా యాసంగిలో అంత పంట పండింది అని హరీశ్‌రావు గుర్తు చేశారు.