Harish Rao | హైదరాబాద్ : రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. విద్యుత్ విషయంలో కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే.. సూర్యుడి మీద ఉమ్మేసినట్టే అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.
రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం ఏంటో ఇవాళ తెలిసిపోయిందని హరీశ్‌రావు తెలిపారు. రేవంత్ రెడ్డి 3 గంటల కరెంట్ చాలు అంటారు. ఉచిత కరెంట్‌కు సోనియాగాంధీ వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుజాత చెప్తారు. రైతులకు 8 గంటల కరెంట్ చాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బోరుబావుల వద్ద మీటర్లు పెడుతామని మరో అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మాట్లాడుతారు అని హరీశ్‌రావు గుర్తు చేశారు.
ఈ రోజు రైతు వ్యతిరేక వైఖరిని, తమకున్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచి కాంగ్రెస్ పార్టీ ప్రజాగ్రహానికి గురైంది అని హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలపై రైతులు తిరగబడుతున్నారు. చేసేదేమీ లేక కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నారు. విద్యుత్ విషయంలో కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే. ఈ దేశంలో నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు గంటలు కూడా రైతులకు కరెంట్ ఇవ్వలేదు అని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఆరు గంటల కరెంట్ ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడంతో.. ఆరు గంటల కరెంట్ ఓ అబద్ధం అని నాటి ప్రముఖ పత్రికలు రాశాయి. పంట కరెంట్‌కు సర్కార్ స్విచాఫ్.. రైతులకు కరెంట్ ఇవ్వకుండా చేతులెత్తిసిందని, చేలకు చీకట్లు అని పత్రికలు వార్తాకథనాలు రాశాయి. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన వార్తలు అని గుర్తు చేశారు. రైతుల ఆత్మహత్యలపై కూడా పలు పత్రికలు కార్టూన్లు వేశాయి. రైతులకు ఏడు గంటల కరెంట్ కూడా ఇవ్వలేమని నాటి ముఖ్యమంత్రి స్టేట్మెంట్లు ఇచ్చారు. వ్యవసాయానికి పగటిపూట రెండు గంటల కరెంట్ కూడా లేదు అని వార్తా కథనాలు వచ్చాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. మళ్లీ నాటి కాలాన్ని తీసుకువస్తామని ఆ పార్టీ నేతలు చెప్పకనే చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకుంటుందని హరీశ్‌రావు మండిపడ్డారు.