హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): నిజం పలికితే తల వెయ్యి ముక్కలు అవుతుందని అమిత్‌షాకు ఏదైనా శాపం ఉందేమోనని రాష్ట్ర మంత్రి టీ హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. అమిత్‌షా నోరు అబద్ధాల బోరు అని వ్యాఖ్యానించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మంగళవారం ఆదిలాబాద్‌లో చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనని ధ్వజమెత్తారు. గిరిజన యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం 2016 సెప్టెంబర్‌లోనే భూములను కేటాయించినా.. ఏడేండ్లుగా యూనివర్సిటీ ఏర్పాటు విషయాన్ని తేల్చకుండా ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ఇప్పుడు హడావుడి ప్రకటన చేసి రాష్ట్ర ప్రభుత్వంపై నిందలేస్తే గిరిజన బిడ్డలు ఊరుకోరని హెచ్చరించారు.
కృష్ణా జలాల్లో వాటా కోసం తెలంగాణ కృషి చేయ లేదనడం అమిత్‌షా అజ్ఞానానికి, అబద్ధానికి పరాకాష్ఠ అని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించిన నెల రోజులకే (2014 జూలై 14న) కేంద్రానికి కృష్ణాజలాల వాటా తేల్చాలని, అంతరాష్ట్ర జలవివాదాల చట్టం 1956లోని సెక్షన్-3 ప్రకారం కృష్ణాజలాల పునఃపంపిణీ చేపట్టాలని డిమాండ్ చేసిన విషయాన్ని ఆధారాలతో సహా వెల్లడించారు. ఎన్నికల ముందు లబ్ధిపొందేందుకు ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసిన విషయం నిజం కాదా? అని నిలదీశారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందనడం అమిత్ షా అవగాహనారాహిత్యానికి పరాకాష్ఠ అని పేర్కొన్నారు. ఎన్సీఆర్బీ నివేదిక మహారాష్ట్రలో అత్యధికంగా రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని వెల్లడించిందని గుర్తు చేశారు.