సంగారెడ్డి, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలోని కొల్లూరులో కోటీశ్వరులు ఉండే ఇలాకాలో పేదల కోసం ఆత్మగౌరవ భవనాలు నిర్మించి ఉచితంగా పంపిణీ చేస్తున్న ఘనత కేసీఆర్‌దేనని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రజల కోసం పనిచేయకుండా నిత్యం ధర్నాలు, నినాదాలకు పరిమితమవుతున్నాయని విమర్శించారు. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే పేదల కోసం పనిచేస్తున్నదని పేర్కొన్నారు. పేదలకు ఇచ్చిన అన్ని వాగ్ధానాలు నెరవేర్చామని పునరుద్ఘాటించారు. హైదరాబాద్‌లోని పేదలకు ఒకేరోజు 11,700 డబుల్ బెడ్రూం ఇండ్లను కేసీఆర్ ప్రభుత్వం పంపిణీ చేసిందని తెలిపారు. పేదల సొంతింటి కలను సాకారం చేసిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. నయా పైసా లంచం లేకుండా పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను అందజేస్తున్నట్టు చెప్పారు. పేదల కోసం పనిచేస్తున్న సీఎం కేసీఆర్‌ను మరోమారు ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.
శనివారం సంగారెడ్డి జిల్లాలోని కొల్లూరులోని 2 బీహెచ్‌కే డిగ్నిటీ హౌజింగ్ కాలనీ-1లో పేదలకు ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పటాన్చెరు, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, గోషామహాల్, కార్వాన్, ఖైరతాబాద్, నాంపల్లి నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులకు ఇండ్ల పత్రాలను మంత్రి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో రూ.9 వేలకోట్లు ఖర్చుచేసి హైదరాబాద్‌లో పేదల కోసం లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించినట్టు చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపును రాజకీయం చేయాలనుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. కొన్ని రాజకీయపార్టీలు నినాదాలు, ధర్నాలకే పరిమితమవుతున్నాయని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ది సొల్యూషన్ ప్రభుత్వమని, తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేస్తుందని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేసీ సర్కార్ బోల్ నా జ్యాదా హై.. కామ్ పకోడీ జైసా హై అని విమర్శించారు. డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న ఉత్తరప్రదేశ్, గుజరాత్లో ఎక్కడైనా పేదల కోసం డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించారా? అని ప్రశ్నించారు. బీజేపీది డబుల్ ఇంజిన్ సర్కారు కాదు.. ట్రబుల్ ఇంజిన్ సర్కారు అని ఎద్దేవా చేశారు.
ఆసియాలో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ
సంగారెడ్డి జిల్లాలోని కొల్లూరులో ఆసియాలోనే అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ డబుల్ బెడ్రూం ఇండ్లను కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. పేదలకు అందజేస్తున్న ఒక్కో ఇంటి విలువ రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. కోటీశ్వరులు ఉండే నివాస ప్రాంతంలో పేదలకు ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని చెప్పారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి రూ.60 వేలు ఇచ్చేదని, అందులో లబ్ధిదారుడి పేరిట రూ.40 వేల రుణం ఉండేదని గుర్తుచేశారు. రూ.40 వేలపై మిత్తితోపాటు అప్పు మిగిలిపోయేది కానీ ఇల్లు పూర్తయ్యేది కాదని అన్నారు. ప్రస్తుతం ఒక్కపైసా ఖర్చులేకుండా పూర్తిగా ఉచితంగా పేదలకు రూ.60 లక్షల విలువ చేసే డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తున్నట్టు చెప్పారు. ఇండ్ల పంపిణీ కార్యక్రమం చూస్తుంటే ఒకేరోజు దసరా, రంజాన్, క్రిస్మస్ జరపుకొంటున్నట్టు ఉన్నదని ఆనందం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేల కోరిక మేరకు కొల్లూరు డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయంలో ప్రభుత్వ దవాఖాన, అంగన్వాడీ కేంద్రం, రేషన్‌షాపు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
రాజాసింగ్ బీజేపీ ఎమ్మెల్యే అయినా ప్రజలు తెలంగాణవారు కాబట్టి, ఆయన కోరిన విధంగా ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడుపుతామని చెప్పారు. దానం నాగేందర్ ఈ ప్రాంతంలో ఆలయం, మసీదు, చర్చి కావాలని కోరారని, వాటిని కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో అనేక పార్టీలు వచ్చి రకరకాల మాటలు చెప్తాయని, వాటిని నమ్మవద్దని, కేసీఆర్‌కు అండగా నిలవాలని కోరారు. సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని, హైదరాబాద్‌లో 350 బస్తీ దవాఖానలు ఏర్పాటుచేసి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్టు చెప్పారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక తాగునీటి కోసం హైదరాబాద్‌లో ఎక్కడా ధర్నాలు జరగడం లేదని గుర్తుచేశారు. డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చిన వారెవ్వరూ అమ్ముకోవద్దని కోరారు. డబుల్ బెడ్రూం ఇండ్లను దశలవారీగా కేటాయిస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు.
సీఎం కేసీఆర్ వల్లే ఇంటి కల సాకారం: ఎమ్మెల్యే దానం నాగేందర్
సీఎం కేసీఆర్ వల్లే పేదల డబుల్ బెడ్రూం ఇండ్ల కల నెరవేరినట్టు ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పారు. ప్రతిపక్షాలు కుళ్లుకునేలా పేదలకు సంక్షేమ పథకాలతోపాటు డబుల్ బెడ్రూం ఇండ్లు అందజేస్తున్నామని తెలిపారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని అర్హులైన వారందరికీ ఇండ్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. పేదల సొంతింటి కల నెరవేర్చిన సీఎం కేసీఆర్‌కు ప్రజలు అండగా నిలుస్తారని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు ఇకపై కేసీఆర్‌ను విమర్శిస్తే ప్రజలే తరిమికొడతారని హెచ్చరించారు.
సంతోషకర సందర్భం: ఎమ్మెల్యే రాజాసింగ్
కేసీఆర్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ చేయడం సంతోషంగా ఉన్నదని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఇక్కడికి వచ్చేవారి కోసం ప్రత్యేకంగా బస్సులు నడపాలని కోరారు. ఎమ్మెల్యేలు కౌసర్ మొహియుద్దీన్, జాఫర్ హుస్సేన్ మేరాజ్ డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీపై హర్షం వ్యక్తంచేశారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలోని కొల్లూరులో హైదరాబాద్‌లోని పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించడం ఆనందంగా ఉన్నదని అన్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ భూపాల్‌రెడ్డి, సంగారెడ్డి కలెక్టర్ శరత్, మాజీ ఎమ్మెల్యే కే సత్యనారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ లలితాసోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ముఖాలెక్కడ పెట్టుకుంటారు?: ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్
హైదరాబాద్‌లో పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తానని సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని, ఇప్పుడు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలు ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఎలాంటి సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చినా కాంగ్రెస్, బీజేపీ వణికిపోతున్నాయని ఎద్దేవా చేశారు. గతంలో డబుల్ బెడ్రూం ఇండ్ల విషయమై కాంగ్రెస్, బీజేపీ ధర్నాలు చేశాయని, ఇప్పుడు పేదలకు ఇండ్లు ఇస్తుంటే కిమ్మనటం లేదన్నారు. ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు.
లబ్ధిదారులతో హరీశ్‌రావు సంభాషణ..
హరీశ్‌రావు: అమ్మా నీ పేరు ఏమిటి? ఎక్కడ ఉంటావు?
శ్రీలక్ష్మీ: సార్ నా పేరు శ్రీలక్ష్మి. పటాన్చెరులో ఉంటాను.
హరీశ్‌రావు: సొంత ఇంట్లో ఉంటావా? కిరాయి ఇంట్లో ఉంటావా?
శ్రీలక్ష్మీ: కిరాయి ఇంట్లో ఉంటా సార్.. నెలకు రూ.6 వేలు.
హరీశ్‌రావు: కొల్లూరులో డబుల్ బెడ్రూం సముదాయంలో నీకు సొంత ఇల్లు వచ్చింది.
రూ.6 వేల కిరాయి తప్పింది.. సంతోషమేనా?
శ్రీలక్ష్మీ: ఎమ్మెల్యే సార్ ఫోన్‌చేసి చెప్పారు నాకు డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చిందని. నాకు చాలా సంతోషంగా ఉన్నది సార్.
హరీశ్‌రావు: ఎవరు ఇచ్చిండ్రు మీకు డబుల్ బెడ్రూం ఇల్లు?
శ్రీలక్ష్మీ: సీఎం కేసీఆర్ సార్..
హరీశ్‌రావు: కేసీఆర్ సార్‌ను గుర్తుపెట్టుకుంటావా?
శ్రీలక్ష్మీ: చాలా గుర్తుపెట్టుకుంటాను సార్. జన్మలో మర్చిపోను.
హరీశ్‌రావు: ఓవైపు పెద్దపెద్దోళ్లు, కోటీశ్వరులు ఉండే ఇండ్లు.. ఇంకోవైపు అదే ఏరియాలో సీఎం కేసీఆర్ సార్ పేదలకు ఇక్కడే పెద్ద భవనాలు కట్టి ఇచ్చిండు.
శ్రీలక్ష్మీ: అవును సార్. ఇలాంటి ఏరియాలో ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. మీకు, కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటాను. కృతజ్ఞతలు సార్.
సాదికాబేగం: అస్సలాముఅలైకుమ్.. మంత్రి హరీశ్‌రావు గారికి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ధన్యవాదాలు. డబుల్ బెడ్రూం ఇచ్చినందుకు కేసీఆర్ సార్‌కు, తెలంగాణ క్షేమం కోసం దేవున్ని ప్రార్థిస్తాం. సీఎం కేసీఆర్‌పై దేవుడి ఆశీస్సులు ఉండాలి. శత్రువుల నుంచి ఆయనను, తెలంగాణను కాపాడాలని అల్లాను కోరుకుంటున్నా.
హరీశ్‌రావు: అమ్మా ప్రస్తుతం మీరు ఎక్కడ ఉంటున్నారు?
సాదికాబేగం: ఖైరతాబాద్ నియోజకవర్గం ఎంఎస్‌మక్తాలో కిరాయికి ఉంటున్నాం.
హరీశ్‌రావు: ఇంటి కిరాయి నెలకు ఎంత అమ్మా?
సాదికాబేగం: నెలకు రూ.5 వేలు సార్.
హరీశ్‌రావు: మీకు డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చినట్టు ఎమ్మెల్యే ఫోన్ చేశారా?
సాదికాబేగం: అవును సార్. నాకు కొల్లూరులో డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చిందని ఎమ్మెల్యే సార్ ఫోన్లో చెప్పారు.
హరీశ్‌రావు: ఈరోజు మీకు కేటాయించిన ఇల్లు ధర తక్కువలో తక్కువ రూ.60 లక్షలు ఉంటుంది. ఒక్క రూపాయి లోన్లేదు, మిత్తిలేదు. రూ.60 లక్షల విలువ చేసే ఇల్లు ఎలాంటి ఖర్చులేకుండా మీకు ఇస్తున్నాం.
సాదికాబేగం: ఇంత విలువైన ఇల్లు ఇచ్చిన సీఎం కేసీఆర్‌ను గుర్తు పెట్టుకుంటాం.
మహిపాల్‌రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే: అన్నా ఈ ఏరియాలో ఒక్కో ఇంటి ధర రూ.కోటి నుంచి రూ.కోటిన్నర ఉంటుంది.
అగ్గిపెట్టె రూంలు.. ఊపితే ఊడిపోయే కిటికీలు.. వానొస్తే కురిసే స్లాబులు, కాళ్లు ముడుచుకొనేందుకు కూడా వీలులేని ఇరుకైన గదులు..అసౌకర్యాలు, వసతులలేమితో బూత్‌బంగ్లాలను తలపించే గృహాలు.. కట్టిన ఇండ్లకూ ఏండ్ల తర్వాత బిల్లులు..అందులోనూ అక్రమాలు..
-ఇదీ కాంగ్రెస్ హయాంలో నిరుపేదలకు కేటాయించిన ఇందిరమ్మ ఇండ్ల బాగోతం
560 చదరపు అడుగుల ప్లింత్ ఏరియాతో, రూ.8.65 లక్షల వ్యయంతో సకల హంగులు, మౌలిక సదుపాయాలు కల్పిస్తూ నిరుపేదలు ఆత్మగౌరవంతో బతికేలా కేసీఆర్ సర్కారు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించింది. బడాబాబులు నివసించే చోట బడుగు, బలహీన వర్గాలకు రూ.30 లక్షల నుంచి రూ. 50 లక్షల విలువ చేసే డబుల్ బెడ్ రూం ఇండ్లను నయాపైసా ఖర్చులేకుండా అప్పజెప్పింది.
-ఇది బీఆర్ఎస్ పాలనలో అందజేస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లతో గౌరవం
జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లకు శ్రీకారం చుట్టగా.. మొదటి దశలో 9 ప్రాంతాల్లో 11,700 మంది లబ్ధిదారులకు ఇండ్లను లాటరీ పద్ధతిలో కేటాయించి, నిరుపేదల సొంతింటి కలను ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చారు.