నిజామాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రెండు రోజులుగా టీఆర్ఎస్పై అసత్య ఆరోపణలు చేస్తున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్ తదితరులు గట్టి కౌంటర్ ఇవ్వడంతో తోకముడిచారు. ఆయుష్మాన్ భారత్‌లో తెలంగాణ చేరలేదంటూ నోటికొచ్చినట్టు నిర్మల మాట్లాడటంతో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టత ఇచ్చారు. రేషన్ షాపుల్లో మోదీ ఫొటోలు పెట్టాలంటూ హుకుం జారీ చేయడంపైనా ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఇలా కేంద్ర మంత్రి చేసిన ఆరోపణల్లో పసలేకపోవడంతో బీజేపీ నేతలు మీమాంసలో పడ్డారు. ప్రజల నుంచి సరైన స్పందన రాకపోవడంతో మీడియా ముందు నిలబడలేక నిర్మల.. శుక్రవారం మధ్యాహ్నం నిజామాబాద్ జిల్లా వర్నిలో జరగాల్సిన ప్రెస్‌మీట్‌ను రద్దు చేసుకొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ నుంచి కేంద్ర మంత్రికి గట్టి సమాధానాలు రావడంతో ఏమి చెప్పాలో తెలియకనే మీడియా సమావేశం రద్దు చేసుకున్నట్టు బీజేపీ కార్యకర్తలే గుసగుసలాడుతున్నారు.
ఇక్కడ కేసీఆర్ చాలా బలమైన నేత
‘తెలంగాణలో టీఆర్ఎస్ బలంగా ఉన్నది. ఇక్కడ కేసీఆర్ చాలా బలమైన నేతగా ఉన్నారు. మనం అధికారంలోకి రావాలంటే మరింత కష్టపడాలి. ఇందుకు సోషల్ మీడియాను మరింతగా వాడుకోవాలి. ప్రచారంతో ముప్పేట దాడి చేయాలి. అబద్ధాలైనా సరే.. పదే పదే ప్రచారం చేయండి. కేసీఆర్ కుటుంబాన్ని వదలొద్దు. ఏది పడితే అది బురద రాసి ప్రచారం చేయండి. ప్రజలను నమ్మించండి’ అంటూ స్వయంగా నిర్మలా సీతారామన్ అన్నట్టు తెలిసింది. ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ అనైతిక చర్యలకైనా వెనకడుగు వేయడం లేదని మరోసారి స్పష్టమైంది. లోక్‌సభ ప్రవాస్ యోజన పేరుతో మూడు రోజుల పర్యటన నిమిత్తం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో నిర్మల పర్యటిస్తున్నారు. రెండో రోజు కార్యక్రమంలో భాగంగా రుద్రూర్, వర్ని మండలాల్లో జరిగిన సోషల్ మీడియా, ఆల్ మోర్చా మీటింగ్‌లో బీజేపీ కార్యకర్తలకు చేసిన హితబోధలో అసత్యాలు, అబద్ధాలు ప్రధానంగా ప్రచారం చేయాలన్న ఆ పార్టీ మీటింగ్‌లలో మీడియా ప్రవేశాన్ని నిషేధించారు. పైగా కార్యకర్తల ఫోన్లు అనుమతించకుండా గుట్టుగా నిర్వహించారు.
తన్నుకున్న కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు
బాన్సువాడ పట్టణంలో ఓ బీజేపీ కార్యకర్త ఇంట్లో అల్పాహారం చేసేందుకు వచ్చిన కేంద్ర మంత్రి నిర్మల కాంగ్రెస్ యువజన విభాగం కార్యకర్తలు అడ్డుతగిలారు. కాన్వాయ్కి ఎదురెళ్లి బీజేపీకి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కంగుతిన్న బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా వారిపై దాడికి పాల్పడుతున్న దృశ్యం.