Harish Rao | సిద్దిపేట : తెలంగాణలో జనాలను నమ్ముకున్న నాయకుడే నిలబడతాడు.. జమిలిని నమ్ముకున్న నాయకుడు కాదు అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. నల్లాలు ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలా..? నల్ల చట్టాలు తెచ్చిన బీజేపీ కావాలా? అనే విషయాన్ని ఆలోచించుకోవాలన్నారు. తెలంగాణ సమాజం మూడోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలని సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకుందని మంత్రి తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల సన్నాహక కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఎట్లా ఉండాలంటే సతీష్ బాబు లాగా ఉండాలే. నిజాయితీగల శాసనసభ్యుడు అని ప్రశంసించారు. ఆ రోజుల్లో గులాబీ జెండాకు ఉత్తర తెలంగాణలో అడ్డా అంటే మాకు కెప్టెన్ లక్ష్మీకాంతరావు. కొన్ని వందలసార్లు ఉద్యమంలో అన్నం పెట్టి ఆతిథ్యం ఇచ్చినటువంటి గొప్ప ఇల్లు మా సతీష్ అన్నది. తెలంగాణ కోసం గట్టిగా నిలబడేటువంటి మంచి మనసున్న కుటుంబం మా కెప్టెన్ కుటుంబం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఎవరినడిగినా మూడోసారి ఎవరు ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ అనే సమాధానం వస్తుందని, హుస్నాబాద్‌లో కూడా మూడోసారి సతీష్ కుమార్‌ను గెలిపించుకుందాం అని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో తండాలు గ్రామపంచాయతీలు అయ్యాయి. గౌరెల్లి ప్రాజెక్టు పూర్తవుతుందంటే ఇది కేవలం కేసీఆర్ వలన సాధ్యమైందన్నారు. మిడ్ మానేర్ ద్వారా గోదావరి నీళ్లను హుస్నాబాద్ నియోజకవర్గానికి తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ది అని పేర్కొన్నారు. గండి మహాసముద్రం ఏడాది లోపల నిర్మించి నిలిచామన్నారు. గౌరెల్లి ప్రాజెక్టు నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు సృష్టించారు. అయినా సరే గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని స్పష్టం చేశారు. ఏడాదికి రెండు పంటలు పండుతున్నాయి అంటే అది కేసీఆర్ వల్లనే సాధ్యమైందని తేల్చిచెప్పారు.
కాంగ్రెస్ పార్టీది దొంగ డిక్లరేషన్ అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో 2000 పెన్షన్ ఇచ్చారా..? కల్యాణ లక్ష్మి ఇచ్చారా..? మిషన్ భగీరథ మంచినీళ్లు ఇచ్చారా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఓట్లు అడుగుతదని నిలదీశారు. చీప్ ట్రిక్కులకు మాయమాటలకు ప్రజలు మోసపోవద్దు. తెలంగాణ సమాజం మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి చేయాలని సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకుంది. గులాబీ సైనికులుగా మనం ప్రతి ఇంటికి వెళ్లి వాస్తవాలను ప్రజలకు వివరించాలని హరీశ్‌రావు సూచించారు.
రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బిచాణ ఎత్తేసింది.. ఓటమి భయంతోనే బీజేపీ జమిలి ఎలక్షన్లు అంటుందని మంత్రి ధ్వజమెత్తారు. తెలంగాణలో జనాలని నమ్ముకున్న నాయకుడే నిలబడతాడు.. జమిలిని నమ్ముకున్న నాయకుడు కాదని చెప్పారు. ఇండియా – పాకిస్తాన్ మధ్య కొట్లాట, హిందూ ముస్లింల కొట్లాట పెట్టి బీజేపీ గెలవాలనుకుంటుందని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలను నూకలు బుక్కమన్న బీజేపీకి నూకలు లేకుండా చేశారు ప్రజలు. కాంగ్రెస్, బీజేపీ తిట్లలో పోటీపడితే మనమేమో కిట్లతో పోటీ పడుతున్నాము. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ వంటి పథకాలు అమలు చేస్తున్నాం. తిట్లు కావాలంటే కాంగ్రెస్‌కు ఓటేయండి.. కిట్లు కావాలంటే బీఆర్ఎస్కు ఓటు వేయండి అని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు లక్ష్మీకాంతరావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, స్థానిక శాసనసభ్యులు వోడితెల సతీష్ కుమార్, జెడ్పి చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.