హుస్నాబాద్, ఫిబ్రవరి 8: సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ర్టాల విభజన జరిగిందని, సుఖ ప్రసవం కాలేదని ప్రధాని మోదీ రాజ్యసభలో వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మొదటి నుంచి సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నదని బీజేపీ ప్రభుత్వమేనని విమర్శించారు. మంగళవారం ఆయన సిద్దిపేట జిల్లా పోతారం(జే) గ్రామంలో నిర్వహించిన దళితబంధు సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ర్టాలు విడిపోయిన రాత్రికి రాత్రే 7 మండలాలు, లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును ఏపీలో కలపడం ఏ సమాఖ్య స్ఫూర్తికి నిదర్శనమని ప్రశ్నించారు. ఒక ఓటు రెండు రాష్ర్టాలు అంటూ కాకినాడ తీర్మానం చేసిన బీజేపీ మాట నిలుపుకొని ఉంటే ఇంతమంది విద్యార్థులు, యువకుల ప్రాణాలు పోయేవికావని చెప్పారు. విభజన చట్టం ప్రకారం బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీని ఎందుకు మంజూరు చేయలేదని ప్రశ్నించారు. వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సిన రూ.900 కోట్ల నిధులు ఎక్కడికి పోయాయని నిలదీశారు. కొట్లాడి చట్టబద్ధంగా తెలంగాణను తెచ్చుకున్నాం కాబట్టే దేశంలోనే ఆదర్శంగా నిలిచామని చెప్పారు. అభివృద్ధిలో తన సొంత రాష్ట్రం గుజరాత్‌ను మించిపోతున్నదన్న బాధతోనే మోదీ తెలంగాణపై అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను అవమానపరుస్తూ, కించపరచడమే కాకుండా విషం చిమ్ముతున్నారని విమర్శించారు. తెలంగాణ బీజేపీ నాయకులు ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతారో చెప్పాలని నిలదీశారు. మోదీ పభుత్వ హయాంలో తెలంగాణ మాత్రమే వివక్షను, అహంకారాన్ని చవిచూసిందని ట్వీట్ చేశారు.