హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం తీసుకొంటున్న పకడ్బందీ చర్యల వల్ల మాతృ మరణాల సంఖ్య తగ్గింది. వైద్యరంగం బలోపేతంతోపాటు మాతాశిశు మరణాల సంఖ్యను తగ్గించేందుకు సీఎం కేసీఆర్ ఆలోచకనుగుణంగా శాఖ చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. కేసీఆర్ కిట్, అమ్మఒడి వంటి పథకాలతో పాటు దవాఖానలను బలోపేతం చేయడం వల్ల రాష్ట్రంలో మాతృ మరణాల నిష్పత్తి (మెటర్నల్ మోర్టాలిటీ రేషియో -ఎంఎంఆర్) గణనీయంగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం’ (ఎస్ఆర్ఎస్) తాజాగా విడుదల చేసిన (2018-20) నివేదికలో వెల్లడించింది. 2017-19లో రాష్ట్రంలో ఎంఎంఆర్ 56 ఉండగా, ఇపుడు 43కు తగ్గిందని ప్రకటించింది. అతి తకువ మాతృ మరణాలు నమోదవుతున్న రాష్ర్టాల్లో కేరళ, మహారాష్ట్ర తర్వాత మూడో స్థానంలో తెలంగాణ నిలిచింది. స్వరాష్ట్రంలో 49 పాయింట్లు తగ్గుదల జాతీయ ఆరోగ్య సూచీల్లో మొదటి నుంచి తెలంగాణ చక్కటి ప్రతిభ కనబరుస్తున్నది. రాష్ట్ర ఆవిర్భావం నాటికి ఎంఎంఆర్ 92 ఉండగా.. సీఎం కేసీఆర్ తీసుకొంటున్న చర్యల వల్ల 49 పాయింట్లు తగ్గింది. 2014లో జాతీయ సగటు 130 కాగా, తాజా నివేదికలో 97 అని పేర్కొన్నది.
ఫలిస్తున్న ప్రభుత్వ చర్యలు
కేసీఆర్ కిట్ పథకం మాతాశిశు సంరక్షణలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఈ పథకం కింద నమోదైన వారికి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తుండటంతోపాటు అన్నిరకాల మందులను ఉచితంగా అందజేస్తున్నారు. గర్భిణులకు గోలీల రూపం లో ఐరన్ టాబ్లెట్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ కావడం విశేషం. అమ్మఒడి వాహనాల ద్వారా ఉచిత రవాణా సౌకర్యం కల్పించడం మరింత కలిసొచ్చింది. ఇప్పటివరకు 12.66 లక్షల మందికి కేసీఆర్ కిట్ పథకం కింద రూ.1,261 కోట్ల ఆర్థిక సాయం అందగా.. రూ.263 కోట్లు విలువ చేసే కిట్లను అందుకొన్నారు. మొత్తంగా కేసీఆర్ కిట్ పథకానికి రూ.1525 కోట్లు వెచ్చించింది. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మిడ్ వైఫరీ వ్యవస్థను ప్రారంభించింది. 207 మంది నర్సులకు శిక్షణ ఇచ్చి వివిధ ప్రభుత్వ దవాఖానల్లో నియమించింది. అంతేగాక ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెంచేలా ఆశాలు, ఎఎన్ఎంలు ప్రతినెలా సమీక్ష చేస్తున్నారు. ఇలాంటి పలు చర్యలు మాతృ మరణాల సంఖ్య తగ్గుదలకు దోహదం చేసింది.
బీజేపీ రాష్ర్టాల్లో విఫలం
మాతృమరణాల కట్టడిలో బీజేపీ పాలిత రాష్ర్టాలు విఫలం అయ్యాయి. మహారాష్ట్రను మినహాయిస్తే మిగతా రాష్ర్టాలన్నీ తెలంగాణ కన్నా వెనుకబడే ఉన్నాయి. 2018-20లో అత్యధిక మాతృ మరణాల్లో టాప్-3 బీజేపీ పాలిత రాష్ట్రాలే కావడం గమనార్హం. ఎస్ఆర్ఎస్ తాజా నివేదికలో అత్యధిక ఎంఎంఆర్ అస్సాం (195), మధ్యప్రదేశ్ (173), ఉత్తరప్రదేశ్(167), కర్ణాటక (69), గుజరాత్ (57). 2017-19తో పోల్చితే 2018-20 నాటికి దాదాపు అన్ని రాష్ర్టాల్లో ఎంఎంఆర్ తగ్గగా.. మూడు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో మాత్రం తగ్గకపోగా పెరిగింది. మధ్యప్రదేశ్ 163 నుంచి 173, హర్యానా 96 నుంచి 110, ఉత్తరప్రదేశ్‌లో ఎలాంటి మార్పు నమోదు కాలేదు.
సిబ్బంది కృషి అభినందనీయం
సీఎం కేసీఆర్ ఆలోచనతో రాష్ట్రంలో మాతాశిశు సంరక్షణ చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. మాతృ మరణాలు తగ్గించేందుకు ఇవి దోహదం చేస్తున్నాయి. కేసీఆర్ కిట్, అమ్మఒడి వాహనాలతోపాటు, ఇతర సంరక్షణ చర్యలు ప్రభావం చూపాయి. ఫలితంగా ఎంఎంఆర్ 56 నుంచి 43కు తగ్గటం గొప్ప విషయం. దీంతో సంతృప్తి చెందకుండా మాతృ మరణాలు తగ్గించడంలో 3వ స్థానం నుంచి 1వ స్థానానికి చేరాలి. మాతాశిశు ఆరోగ్య రక్షణకు విశేష కృషి చేస్తున్న వైద్య అధికారులు, సిబ్బందికి అభినందనలు.
–హరీశ్‌రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి