Gandhi Medical College Graduation Ceremony | గాంధీ మెడికల్ కాలేజీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. వైద్య విద్యార్థుల స్నాతకోత్సవంలో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఎంబీబీఎస్ సీట్లలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. 2014లో 2850 ఉన్న ఎంబీబీఎస్ సీట్లను 8,515కు పెంచినట్లు చెప్పారు.
వైద్య పీజీ సీట్లలో రెండో స్థానానికి చేరామని, 2014లో 1183 పీజీ వైద్య సీట్లు ఉంటే.. 2,890కి పెంచామన్నారు. జిల్లాకొక వైద్య కళాశాల ఏర్పాటు ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. ప్రతి జిల్లాకో వైద్య కళాశాల ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. స్టైఫండ్ చెల్లింపులోనూ చాలా రాష్ట్రాలకంటే తెలంగాణ ముందుందని, పీజీ మొదటి ఏడాది రూ.58వేలు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం రాష్ట్రంలో వైద్యులు ఉన్నారని చెప్పారు.