సంగారెడ్డి : పచ్చిరొట్ట విత్తనాల సాగును పెంచి, నేలను సారవంతం చేసుకోని.. పంటలో అధిక దిగుబడులు సాధించుకోవాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సూచించారు. సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన వానాకాలం సాగు సన్నాహక సమావేశానికి మంత్రి హరీశ్‌రావు హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో అతి తక్కువగా వరి సాగు చేసిన జిల్లా సంగారెడ్డి మాత్రమే అని తెలిపారు. ఈ జిల్లా రైతులు వాణిజ్య పంటల సాగు చేస్తున్నారని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు రైతుల గురించి పట్టించుకోలేదన్నారు. కానీ కేసీఆర్ సీఎం అయ్యాక.. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అనేక పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు.
మంజీరా నదిపై 12 చెక్ డ్యామ్‌లను నిర్మించామన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కరెంటు కుడా ఇవ్వలేని వారు.. 24 గంటల కరెంట్ ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదన్నారు. రైతు బంధు కాపీ కొట్టి కేంద్రం పీఎం కిషన్ యోజన పేరుతో ఇస్తున్నారని చెప్పారు. తెలంగాణ రైతు ప్రయోజల కోసం బావుల వద్ద మీటర్లు రాకుండా చేస్తున్నామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.