Harish Rao | సిద్దిపేట : ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఫేక్ సర్వేలు, గూగుల్ ప్రచారాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. కనీసం టికెట్లు ఇచ్చుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని మంత్రి పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 15వ తేదీన హుస్నాబాద్‌లో నిర్వహించనున్న సభా ఏర్పాట్లను మంత్రి హరీశ్‌రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే సతీశ్ బాబుతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తొలి ఎన్నికల సభ హుస్నాబాద్‌లో నిర్వహించడం అంటే.. ఇక్కడి ప్రజల మీద ఉన్న ప్రేమ, నమ్మకం అని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో మొదటి సభ ఇక్కడే నిర్వహించారు. అదే విధంగా ఈసారి కూడా హుస్నాబాద్ నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. హుస్నాబాద్ నియోజకవర్గం అంటే లక్ష్మికటాక్ష నియోజకవర్గం. మంచి జరగుతుంది అని ఇక్కడ నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు. పండుగ వాతావరణంలో కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే మాటలు, డబ్బు మూటలు, కర్ఫ్యూలకు, మతకల్లోలాకు చిరునామా అని ధ్వజమెత్తారు. ముఠా రాజకీయాలతో ఢిల్లీలో కాంగ్రెస్ టికెట్ల పంచాయితీ నడుస్తుందన్నారు. బీఆర్ఎస్ టికెట్లు ప్రకటించి 50 రోజులైనా ఇప్పటికీ టికెట్లు ప్రకటించుకోలేని పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు.
హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశామన్నారు. 8 టీఎంసీలతో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసుకున్నామని తెలిపారు. నీళ్లు వస్తే ప్రతి ఒక్కరు సంతోషం పడ్డారు. ప్రతిపక్షాలు మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటున్నాయని విమర్శించారు. హుస్నాబాద్ ఎమ్మెల్యేగా సతీష్ బాబు ఉండటం మీ అందరి అదృష్టమని పేర్కొన్నారు. కేసీఆర్ మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవడం ఖాయమని హరీశ్‌రావు స్పష్టం చేశారు. 2014, 18 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని తేల్చిచెప్పారు.