బన్సీలాల్‌పేట్, జూన్ 4: వైద్యవృత్తి గౌరవాన్ని మరింత పెంచాల్సిన బాధ్యత డిగ్రీ పూర్తి చేసుకుని సమాజ సేవలోకి వెళ్తున్న డాక్టర్లపై ఉన్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం రాత్రి సికింద్రాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజీలో 2016 బ్యాచ్ విద్యార్థుల స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ.. కొత్త డాక్టర్లకు శుభవార్త అందించారు. రాబోయే రోజుల్లో వెయ్యిమంది డాక్టర్ల నియామకాలను చేపట్టబోతున్నామని.. బస్తీ దవాఖాన, పల్లె, పట్టణ ఆరోగ్య కేంద్రాలలో వారిని నియమిస్తామని తెలిపారు. ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న వారికి తెలంగాణ రాక ముందు 570 సీట్లు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం వాటి సంఖ్య 1,212కు పెరిగాయని తెలిపారు.
వచ్చే ఏడాది 225 పీజీ సీట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. గతంలో 700 మాత్రమే ఉన్న మెడికల్ సీట్లు ప్రస్తుతం 2,840 అయ్యాయని, రానున్న కాలంలో వాటిని 5,680కి పెంచుతామని వివరించారు. వివిధ అంశాలలో ప్రతిభ కనబరిచినందుకుగాను ఆనంద్‌బాగ్ నివాసి డాక్టర్ శివకృష్ణను అభినందించిన మంత్రి హరీశ్‌రావు.. ఆయనకు ఐదు బంగారు పతకాలను ప్రదానం చేశారు. 2016 బ్యాచ్‌లో ఎంబీబీఎస్ పూర్తిచేసుకొన్న 200 మంది డాక్టర్లకు అతిథులు పట్టాలను అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వైద్య,విద్య మౌలిక సదుపాయాల కల్పనాసంస్థ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, డీఎంఈ, గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కే రమేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.