SS Rajamouli | బంజారాహిల్స్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): హరీశ్‌రావు పనిమంతుడు అని, ఆయనకు తాను ఓ పెద్ద అభిమానిని అని ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి పేర్కొన్నారు. ఈ తొమ్మిదేండ్లలో తెలంగాణ చాలా అభివృద్ధి చెందిందని, ఇందుకు సిద్దిపేట నియోజకవర్గ డెవలప్మెంటే నిదర్శనమని పేర్కొన్నారు. తాను షూటింగ్లో భాగంగా కొన్నేండ్ల కిత్రం వెళ్లిన సిద్దిపేటకు.. ఇటీవల వెళ్లిన సిద్దిపేటకు ఎంతో తేడా కనిపించిందని, హరీశ్‌రావు, తెలంగాణ సర్కారు పనితీరువల్లే ఇది సాధ్యమయ్యిందని చెప్పారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘లిటిల్ స్టార్స్ అండ్ షీ’ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను మంత్రి హరీశ్‌రావు, ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ, హరీశ్‌రావును కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. హరీశ్‌రావు పనితీరు తనకు నచ్చుతుందని తెలిపారు.
అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ దర్శకుడు రాజమౌళిని కలువడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ‘ఆయన తెలుగుజాతి ఖ్యాతిని అంతర్జాతీయ వేదికల్లో వినిపించిన గొప్ప దర్శకుడు. బాహుబలి సినిమాతో తెలుగు ప్రజల ఖ్యాతిని జాతీయస్థాయిలో ఇనుమడింపజేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో తెలుగు ప్రజల ఖ్యాతిని నిలబెట్టారు. ఆయనకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. రాజమౌళి తండ్రిగారు చాలా సాదాసీదాగా ఉంటారు. ఎంఎన్‌జే దవాఖాన కట్టినప్పుడు ఆయన స్నేహితుడితో కలిసి ఓ 400 పడకల బ్లాక్ శానిటేషన్ బాధ్యతలు తీసుకొని, సమర్థంగా నిర్వహిస్తున్నారు. ఎంతోమంది పేదప్రజలకు సాయం చేస్తుంటారు. రాజమౌళి కూడా ఎంతోమంది చిన్న పిల్లలకు, ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తారని తెలిసి చాలా సంతోషంగా ఉన్నది. దవాఖానకొచ్చాక ఇప్పుడే ఓ విషయం తెలిసింది. రాజమౌళిగారు తండ్రికి తగ్గ తనయుడైతే.. ఆయన కూతురు తండ్రికి తగ్గ తనయ అని తెలిసింది. వారి రక్తంలోనే సేవాభావం ఉంది. ఆయన సినిమాల్లో కూడా దేశభక్తి, సామాజిక బాధ్యత అంతర్లీనంగా ఉంటాయి. ఆయన ఇంకా ఇంకా ఎదగాలని కోరుకుంటున్నా.’ అని వ్యాఖ్యానించారు.
సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో తెలంగాణ హెల్త్ హబ్‌గా, హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారాయని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. నాడు పేదలు రొట్టెలు తింటే, ధనికులు అన్నం తినేవారని, కానీ నేడు ధనికులు రొట్టెలు తింటుంటే.. పేదలు అన్నం తింటున్నారని తెలిపారు. నీతి అయోగ్ నివేదిక ప్రకారం వైద్యంలో దేశంలోనే తెలంగాణ అగ్ర స్థానంలో నిలిచిందని చెప్పారు. రాష్ట్రంలో పేదలకోసం 10వేల సూపర్ స్పెషాలిటీ పడకలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలోని ప్రభుత్వ దవాఖానలు కార్పొరేట్ దవాఖానలతో పోటీ పడుతున్నట్టు చెప్పారు.
తొమ్మిదేండ్లలో ప్రభుత్వ వైద్యరంగంలో తీసుకువచ్చిన మార్పుల కారణంగా గతంలో ప్రభుత్వ దవాఖానల్లో 30 శాతం ఉన్న డెలివరీలు.. నేడు 70 శాతానికి చేరుకొన్నాయని తెలిపారు. సిజేరియన్లు తగ్గించడంతో మాతా, శిశు మరణాలు గణనీయంగా తగ్గిపోయాయని వెల్లడించారు. మాతా, శిశు మరణాలను తగ్గించడంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నదని చెప్పారు. అవయవమార్పిడి శస్త్రచికిత్సల నిర్వహణలో కూడా రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానానికి చేరుకొన్నదని తెలిపారు. రాష్ట్రంలో గర్భిణుల్లో ఎనీమియా సమస్యలను తగ్గించేందుకు జూన్ 14 నుంచి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ అందించనున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సతీశ్ ఘంటా, స్థానిక కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.