కరోనాను ఎదుర్కొనేందుకు అందరూ కలిసిరావాలి
వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపు
హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, అందుకు ప్రజలు కూడా సహకరించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ అవగాహన పోస్టర్‌ను మంత్రి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా బారిన పడకుండా ఉండేందుకు అందరూ టీకాలు వేసుకోవాలని, మాస్క్‌లను తప్పనిసరిగా ధరించి, శానిటైజర్లు వినియోగించాలని పిలుస్తున్నారు. కరోనా నివారణకు అన్ని వర్గాల ప్రజలు, ప్రజాసంఘాలు, సంఘ సేవకులు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం నేతలు గంధం రాములు, భాస్కర్, తలారి చైతన్య, ప్రభారెడ్డి, గంధాల శ్రీనివాస్‌చారి, వల్లెపు శ్రీనివాస్, టీఆర్ఎస్కేవీ నాయకురాలు నిర్మలారెడ్డి, మహిళా కో ఆర్డినేటర్ శాంతి, ప్రీతి తదితరులు పాల్గొన్నారు.