సిద్దిపేట: ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో రాష్ట్రంలోని రైతులు ఆనందంగా ఉన్నారని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. కన్న కొడుకు చూడకపోయినా ఇంటికి పెద్ద కొడుకులా ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) పెన్షన్ ఇస్తున్నారని చెప్పారు. శుక్రవారం ఆయన సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూర్ మండలంలోని చెర్ల అంకిరెడ్డిపల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. గత పాలకుల హయాంలో కరెంట్ (Current), ఎరువుల కొరత తీవ్రంగా వుండేవన్నారు. ఇప్పుడు రైతులకు (Farmers) 24 గంటలు ఉచితంగా కరెంటు అందిస్తున్నామని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల కండ్లలో నీరు వచ్చేవనీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కృషితో ప్రాజెక్టులతో రైతుల కళ్లల్లో ఆనందాన్ని చూస్తున్నామని వెల్లడించారు. రైతుబంధు (Rythu bandhu) కింద రూ.7.50 కోట్లు అందించామని తెలిపారు. రంగనాయక సాగర్ (Ranganayaka sagar) రిజర్వాయర్ నుంచి కాలువల ద్వారా చెరువులు నింపి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తున్నామన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో రూ.వెయ్యి పింఛను (Penssion) కూడా ఇవ్వడం లేదని, తెలంగాణలో రూ.2 వేలు పెన్షన్ అందిస్తున్నామని చెప్పారు.