హైదరాబాద్ సిటీబ్యూరో/ నేరేడ్మెట్/ఉప్పల్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): మల్కాజిగిరిలో మంచితనానికి, రౌడీయిజానికి మధ్య పోటీ జరుగుతున్నదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. డబ్బు చూసుకుని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్న మైనంపల్లి పైసల మైనాన్ని మల్కాజిగిరి ప్రజలు ఓట్లతో కరిగించాలని పిలుపునిచ్చారు. మతకలహాలతో వందలాది మందిని పొట్టన పెట్టుకున్న కాంగ్రెస్‌కు ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పాలని కోరారు. మల్కాజిగిరిలో మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఉప్పల్‌లో బండారి లక్ష్మణ్‌రెడ్డిని గెలిపించాలని.. తాను అండగా ఉండి నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తానని హామీచ్చారు. బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మల్కాజిగిరి, ఉప్పల్‌లో వేర్వేరుగా జరిగిన సమావేశాల్లో హరీశ్‌రావు మాట్లాడారు. ‘ఇవాళ ఇంటింటికి మంచినీరు కేసీఆర్ ఇవ్వగా.. కాంగ్రెసోళ్లకు ఓటు వేసుడెందుకు? రిస్క్‌ల పడుడు ఎందుకు? అక్కాచెల్లెళ్ల పెండ్లి కోసం లక్ష రూపాయలు కేసీఆర్ ఇవ్వగా ఈ బీజేపోళ్లకు, కాంగ్రెసోళ్లకు ఓటు వేసుడెందుకు? రిస్క్‌ల పడుడు ఎందుకు? ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు లేకుండా హైదరాబాద్‌లో కనురెప్ప కొట్టినంత సేపు కూడా కరెంట్ పోకుండా కేసీఆర్ కరెంట్ ఇవ్వగా.. కాంగ్రెసోళ్లకు ఓటు వేసుడెందుకు? రిస్క్‌ల పడుడు ఎందుకు? మనం ఆగమైతే అభివృద్ధి ఉండదు. ఇంత మంచిగా ఉన్న హైదరాబాద్‌ను వారి చేతుల్లో పెడితే దయ్యా లపాలు చేసినవాళ్లమవుతాం. మన భవిష్యత్తు బాగుండాలంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి’ అని అన్నారు.
మైనంపల్లిలా దిగజారి మాట్లాడలేను
గతంలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో మైనంపల్లి హన్మంతరావును ప్రస్తుత మంత్రి మల్లారెడ్డి ఓడించారని, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మర్రి రాజశేఖర్‌రెడ్డి చేతుల్లో మైనంపల్లి ఓడిపోతున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ‘మైనంపల్లిలా నేను దిగజారి మాట్లాడలేను. కొన్ని విలువలతో రాజకీయాల్లో ఉన్నాం. గౌరవంగా ఉంటాం. దిగజారి మాట్లాడుతున్న మైనంపల్లికి విజ్ఞులైన మల్కాజిగిరి ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పాలి’ అని సూచించారు. కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల కష్టాలన్నీ తీరాయని తెలిపారు. ‘నేడు తాగునీటి కష్టాలు లేవు. కరెంట్ బాధలు లేవు. కర్ఫ్యూ లేదు. అనేక దేశాల నుంచి వచ్చిన వారంతా హైదరాబాద్‌ను మెచ్చుకుంటున్నారు’
అని చెప్పారు. ‘కాంగ్రెస్ హయాంలో ఎండకాలం వస్తే ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్ల లొల్లి ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. కేసీఆర్ పాలనలోనే ఇది సాధ్యమైంది. పక్కనున్న కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో తాగడానికి నీళ్లు లేక ప్రజలు అల్లాడుతున్నారు. బెంగళూరు నగరంలో కరెంట్ కోతలు వెంటాడుతున్నాయి’ అని వివరించారు. ఐటీలో కేటీఆర్ కృషితో 6 లక్షల ఉద్యోగాలు సృష్టించామని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ నేతలకు సీఎం కుర్చీలాటలతోనే సరిపోతుందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలంటే కారుకు ఓటెయ్యాలని కోరారు. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్‌లో అత్యాచారాలు, కిడ్నాప్‌లు అత్యధికంగా ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో మాత్రమే ఆడబిడ్డల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని అన్నారు.
కాంగ్రెస్ వస్తే పేకాట క్లబ్బులు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేకాట క్లబ్బులు వస్తాయని, అందుకే కాంగ్రెస్ వద్దు, పేకాట క్లబ్బులు వద్దని హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తూ.. గల్లిలో తిట్టడం హస్యాస్పదంగా ఉన్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీని నమ్మితే ఎండమావులను నమ్మినట్టేనని అన్నారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. మల్కాజిగిరికి మచ్చలేని రాజ న్న ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చిండని..అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని చెప్పారు. ఈ సమావేశాల్లో మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఉప్పల్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, ఉప్పల్ ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్‌రెడ్డి, ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.