కరీంనగర్ : తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వ లేక, ఇక్కడి వనరులు, నిధులు కొల్లగొట్టేందుకు బండి సంజయ్, రేవంత్ రెడ్డి, షర్మిల ఒక్కటవుతున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) ఆరోపించారు. కరీంనగర్(Karimnagar) రూరల్ మండలం నగునూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కరీంనగర్ రూరల్ మండల బీఆర్ఎస్ పార్టీ(BRS meeting) ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య పాలనలో 75 సంవత్సరాలుగా పేరుకుపోయిన దరిద్ర్యాన్ని తొలగిస్తున్నామని అన్నారు. పచ్చని తెలంగాణను చూసి విపక్షాలకు, కడుపు మంట, కళ్ళ మంట ప్రారంభం అయిందని, మన వనరులను కొల్లగొట్టాలని, రాజ్యాధికారం కావాలని మాయమాటలు చెప్పి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణను మన పిల్లల భవిష్యత్‌ను నిర్ణయించేది బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు కేవలం బీఆర్ఎస్కే ఉందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులంతా సీఎం కేసీఆర్(CM KCR)కు బలగమని, బలమని అన్నారు. కార్యకర్తలు పార్టీని కాపాడితే పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటుందని, క్రమశిక్షణ కలిగిన పార్టీగా క్రమశిక్షణ దాటొద్దని కార్యకర్తలకు సూచించారు.