కరీంనగర్ : కరీంనగర్ నగరంలోని రోడ్లన్నీ తళతళలాడన్నదే తన ధ్యేయమనీ, గుంతలు లేని రోడ్లు పై ప్రయాణ సాఫీగా సాగాలన్నదే తన అభిమతమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. 3వ డివిజన్ కిసాన్ నగర్లో మంత్రి మంగళవారం పర్యటించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను ప్రారంభించారు. అనంతరం స్థానిక నాకా చౌరస్తాలో బీటీ రోడ్డు మరమ్మతు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సమైక్య పాలనలో అభివృద్ది కుంటుపడిందని, దీంతో నగరంలోని రోడ్లన్నీ గుంతలమయమై డ్రైనేజీలు దుర్ఘందాన్ని వెదజల్లేవన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత సీఎం కేసీఆర్ సహకారంతో వందలాది కోట్ల రూపాయల నిధులను తీసుకువచ్చి కరీంనగర్ ను గొప్ప నగరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఇప్పటికే నగరంలో 240 కిలోమీటర్ల సీసీ,బీటీ రోడ్లను నిర్మించామని, మరో 147 కిలోమీటర్ల రోడ్ల పనులు పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు.
మరో నెల రోజుల్లో ఈ పనులన్నింటిని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఎన్నికల వేళ మేము పోటీ చేస్తామంటూ ప్రతిపక్ష పార్టీల నుంచి పుస్తెలు కాజేసే వారు..భూములను కబ్జా చేసేవారు..30 కి పైగా జైలు కేసులున్న వారు ముందుకువస్తున్నారని, అలాంటి వారిని నమ్మితే మన బతుకును అధోగతి పాలు చేస్తారు.
అలాంటి వారిపట్ల జాగ్రత్త అంటూ హెచ్చరించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎన్నికల వేళలో తప్ప ఇతర సమయంలో కనిపించరని వారిది అధికార యావేతప్పా ప్రజసేవ పై శ్రద్ద లేదని విమర్శించారు. అలాంటి నాయకులను నమ్మి అధికారం కట్టబెడితే వారు మన సంపదను దోచుకుని తెలంగాణను మళ్లీ గుడ్డిదీపం చేసే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. కరీంనగర్ ఎవరి వల్ల అభివృద్ధి చెందిందో ఆలోచన చేయాలన్నారు.