హైదరాబాద్ : వెనుకబడిన వర్గాల స్ఫూర్తిదాత ప్రధాన బాబు బిందేశ్వరి ప్రసాద్ మండల్ అని మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. ఆగస్టు 25న బీపీ మండల్ జయంతి సందర్భంగా.. ఆయన సేవలను స్మరించుకున్నారు. బిహార్లో యాదవ వర్గంలో జన్మించి.. సోషిత్ దళ్ అనే పార్టీని వెనుకబడిన, దళిత వర్గాల కోసం స్థాపించి బిహార్లో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని నెలకొల్పిన మహనీయుడని కొనియాడారు. సమాజంలో బీసీలు ఎదుర్కొంటున్న వివక్షను ప్రశ్నించి.. ముఖ్యమంత్రి పీఠాన్ని సైతం వదులుకున్న వెనుకబడిన వర్గాల పక్షపాతి అన్నారు.
లోక్సభ సభ్యుడిగా జనతా ప్రభుత్వ హయాంలో 1978లో రెండో జాతీయ బీసీ కమిషన్ సభ్యుడిగా, బీసీల స్థితిగతులపై విస్తృత అధ్యయనం చేసి.. 1980 డిసెంబర్లో నివేదికను సమర్పించారన్నారు. ఓబీసీ రిజర్వేషన్లు 27శాతం సాధించారని, ఇంకా అనేక సిఫారసులను నేటికీ కేంద్ర ప్రభుత్వాలు అమలు చేయకపోవడం దారుణమన్నారు. నాటికే 55 శాతానికిపైగా బీసీల్లో 3,743 కులాలు ఉన్నాయని సాధికారికంగా చెప్పారని.. బీసీ మండల్ సిఫారసు చేసిన 40అంశాల్లో ముఖ్యమైన జనగణనలో బీసీ కులాల గణన నేటి బీసీ ప్రధానిగా చెప్పుకుంటున్న.. మోదీ ప్రభుత్వం చేయాలని డిమాండ్ చేశారు.
బీసీ మంత్రిత్వశాఖ సైతం ఏర్పాటు చేయాలని, అప్పుడే బీపీ మండల్ వంటి మహనీయుడికి సరైన నివాళి అర్పించినట్లవుతుందన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బీపీ మండల్ స్ఫూర్తితో బీసీల అభివృద్ధి సంక్షేమం కోసం ప్రభుత్వం విశేష కృషి చేస్తుందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 19 బీసీ గురుకులాలు ఉంటే వాటిని 262కి పెంచడమే కాక ఈ సంవత్సరమే మరో 48 గురుకులాల ఏర్పాటుతో 310కి పెంచామని గుర్తు చేశారు. నాణ్యమైన విద్యతో పాటు బీసీల ఆత్మగౌరవం ఇనుమడింపచేసేలా వేలకోట్ల విలువైన భూముల్ని హైదరాబాద్ నడిబొడ్డున కేటాయించి నిర్మిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.