Minister Gangula Kamalakar | కరీంనగర్ కార్పొరేషన్ : కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాయమాటలు నమ్మి వచ్చే ఎన్నికల్లో ఢిల్లీ నాయకులకు అధికారం అప్పగిస్తే పచ్చగా ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపేస్తారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం పలు డివిజన్లలో వివిధ అభివృద్ధి పనులకు ఆయన భూమిపూజ చేశారు. ఉదయం కరీంనగర్ మండలంలోని మొగ్దుంపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో ‘సీఎం బ్రేక్ ఫాస్ట్’ పథకాన్ని ప్రారంభించి, విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. అనంతరం బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. గతంలో తెలంగాణ సంపాదన ఆంధ్రా పాలకులు దోచుకున్నారే తప్ప ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన వారికి రాలేదని అన్నారు. ఇప్పుడు పచ్చని తెలంగాణను దోచుకునేందుకు ఢిల్లీ పాలకులు మళ్లీ హైదరాబాద్లో పాగా వేస్తున్నారని హెచ్చరించారు. తెలంగాణను తిరిగి ఆంధ్రాలో కలిపేందుకు బీజేపీ ముసుగులో మాజీ సీఎం కిరణ్ కుమార్రెడ్డి, కాంగ్రెస్ ముసుగులో కేవీపీ, షర్మిల తెలంగాణలోకి వస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారంతా మన కేసీఆర్ను ఓడగొట్టి తెలంగాణను మళ్లీ దోచుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
సీఎం కేసీఆర్ చేతిలోనే తెలంగాణ క్షేమంగా ఉంటుందని, ఢిల్లీ పాలకుల చేతుల్లోకి మళ్లీ అధికారం వెళ్తే రాష్ట్రం అస్తవ్యస్తమై మళ్లీ గుడ్డిదీపం అవుతుందని మంత్రి గంగుల అన్నారు. కేసీఆర్ను కాదని బీజేపీ, కాంగ్రెస్కు అధికారం ఇస్తే గతంలో ఏ అరిగోస పడ్డామో మళ్లీ ఆ పరిస్థితులు వస్తాయని అన్నారు. మన పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎన్నికలప్పుడు తప్ప మళ్ళీ ఎప్పుడూ కనిపించరని, ఎన్నికల వేళ కనిపించి మాయమయ్యే నాయకులు కావాలో లేక నిత్యం ప్రజల్లో ఉండి సమస్యలు పరిష్కరించే పాలకులు కావాలో ప్రజలే ఆలోచించుకోవాలని సూచించారు.