Minister Gangula Kamalakar | కరీంనగర్ కార్పొరేషన్ : సీఎం కేసీఆర్ చేతుల్లోనే తెలంగాణ రాష్ట్రం సురక్షితంగా ఉంటుందని.. అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఢిల్లీలోని కాంగ్రెస్, బీజేపీ పెద్దలకు అధికారం అప్పగిస్తే 50 ఏండ్లు పడ్డ అరిగోస మళ్లీ తప్పదని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులను మంత్రి గంగుల ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. 50 ఏండ్లు తెలంగాణను దోచుకున్న ఢిల్లీ కాంగ్రెస్, బీజేపీలు, మళ్లీ తెలంగాణపై కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఇంతకుముందు ఈ ప్రాంతం అభివృద్ధి కాకుండా చేసిన నాయకులే, ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ ముసుగులో తెలంగాణలో అడ్డా వేశారని విమర్శించారు. పదేళ్లలో జరిగిన తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు. ఇక్కడి సంపదను దోచుకునేందుకే కాంగ్రెస్, బీజేపీల్లోని ఆంధ్రా నాయకులు వస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అలాంటి నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీ కల్లబొల్లి మాటలు నమ్మి ఓట్లు వేస్తే తెలంగాణ భవిష్యత్తు అంధకారం అవుతుందని, పిల్లలు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని సూచించారు. తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే ఐదేళ్లలో కరీంనగర్‌ను అద్భుత నగరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.