కరీంనగర్ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కోట్లాది రూపాయలను ప్రభుత్వం ఖర్చుచేస్తుందని, కార్పొరేట్‌కు దీటుగా విద్యను అందిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమం,పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) అన్నారు. మన బస్తీ – మన బడి (Mana Basti-Mana Badi) కార్యక్రమంలో భాగంగా కరీంనగర్‌లోని 28వ డివిజన్ అశోక్ నగర్ దుర్గమ్మ గడ్డలో కోటి రూపాయలతో నిర్మిస్తున్న పాఠశాల భవనానికి మంత్రి భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు మన బస్తీ-మన బడి ద్వారా పూర్వ వైభవం తీసుకు వస్తున్నామని అన్నారు. దుర్గమ్మ గడ్డ పాఠశాలలో కోటి 35 లక్షల రూపాయలతో రెండు అంతస్తుల భవనం,కాంపౌండ్ వాల్, తాగునీరు, టాయిలెట్, కిచెన్ తో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. కరీంనగర్(Karimnagar) లో రాజకీయాలకతీతంగా నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణాలు పూర్తయితే ప్రపంచంలోనే పర్యాటక కేంద్రంగా (Tourisam) కరీంనగర్ విరాజిల్లుతుందన్నారు.
ఇక్కడి వారికి ఉపాధి అవకాశాలు పెరిగి పిల్లల భవిష్యత్ బంగారు మయమవుతుందన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ లో భాగంగా ప్రపంచంలో మూడవది ఇండియాలో మొదటిదైన బిగ్ ఐలాండ్ ఫౌంటెన్ ను 69 కోట్లతో నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. నగరానికి సరికొత్త శోభను తీసుకువచ్చేందుకు ఆధునిక డిజైన్లతో 13 ఐలాండ్ లను నిర్మిస్తున్నామని అన్నారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత కరీంనగర్ ను 2వ గొప్ప నగరంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
మానేరు రివర్ ఫ్రంట్ లో భాగంగా కరీంనగర్ లో హోటల్ పెడుతామంటూ తాజ్ గ్రూప్ ముందుకు వస్తుందన్నారు. శాంతి భద్రతలు బాగుంటేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, నగర మేయర్ వై సునీల్ రావు, కార్పొరేటర్ నాంపల్లి శ్రీనివాస్, సుడా డైరెక్టర్ యూసుఫ్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ తదితరులు పాల్గొన్నారు.
READ MORE : తెలంగాణ సొమ్ము..గుజరాత్‌కు మళ్లింపు : మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్