కరీంనగర్ : తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలుస్తుందని బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కార్ఖానాగడ్డ అంబేద్కర్ మెమోరియల్ క్లబ్లో రూ.52లక్షలతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌తో పాటు నూతన భవన నిర్మాణాన్ని మేయర్ సునీల్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కేసీఆర్ సర్కారు పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. కుల సంఘాల భవన నిర్మాణాలకు నిధుల వరద పారిస్తుందన్నారు.
క్లబ్ సభ్యుల విజ్ఞప్తి మేరకు రూ.52లక్షల నిధులు కేటాయించడంతో పాటు రీడింగ్ రూమ్, లైబ్రరీ తదితర సదుపాయాలు కల్పించామన్నారు. సమైక్య రాష్ట్రంలో కుల వృత్తులతో పాటు వెనుకబడిన కులాల సంక్షేమం, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలపై పాలకులు పూర్తి నిర్లక్ష్యం చూపారని, గత పాలకుల నిర్లక్ష్యంతో కుల సంఘ భవనాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయని ఆరోపించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎడ్ల సరిత, మెండి శ్రీలత, కుర్ర తిరుపతి, మేచినేని అశోక్ రావు, వంగల పవన్, పిట్టల శ్రీనివాస్, క్లబ్ అధ్యక్షుడు కొంపెల్లి రామన్ కుమార్, శ్యామ్ సుందర్, రామ్ కుమార్, రవీందర్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.