Minister Gangula Kamalakar | కరీంనగర్ రూరల్, మే 2: రాష్ట్రవ్యాప్తంగా సక్రమంగా సాగుతున్న ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులకు పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు అంశంపై మంత్రి గంగులు పలు ప్రశ్నలు వేయగా, కనీస సమాధానాలు చెప్పకుండా తెల్లముఖం వేశారు. ఈ ఘటన మంగళవారం కరీంనగర్ మండలం దుర్శేడులో చోటుచేసుకున్నది. కాంగ్రెస్ నాయకులు రోహిత్‌రావు, పద్మాకర్‌రెడ్డి, మొయినోద్దిన్, సాయిని తిరుపతి, రాంరెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పుకొని నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. వారిని చూసిన మంత్రి గంగుల దగ్గరికి రమ్మని పిలిచారు. ‘అన్నా.. ఎఫ్ఏక్యూ అంటే ఏంటిదే’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులంతా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. తమకు తెలియదని అందులో ఒకరు చెప్పారు. ‘ఎఫ్ఏక్యూ అంటే ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ’ అని మంత్రి గంగులనే చెప్పారు.
ఇది రాష్ట్రం నిర్ణయించేది కాదని, కేంద్రం నిర్ణయిస్తుందని చెప్పారు. ‘తేమ శాతం ఎంత ఉంటే ధాన్యం కొనుగోలు చేస్తారు?’ అని మంత్రి మరో ప్రశ్న వేయగా, 15 శాతమని కాంగ్రెస్ నాయకుడు చెప్పగానే ‘కాదన్నా 17 శాతం ఉండాలి.. ఇది కూడా కేంద్రం ఆధీనంలోని ఎఫ్‌సీఐ నిర్ణయిస్తుందని మంత్రి చెప్పారు. ‘పోయిన యాసంగిలో ఇప్పటి వరకు ఎంత ధాన్యం కొన్నాం, ఈ యాసంగిలో ఎంత ధాన్యం కొన్నామో గిదైనా చెప్పండి’ అని మళ్లీ మంత్రి ప్రశ్నించారు. దానికీ సక్రమంగా సమాధానం చెప్పకపోవడంతో అక్కడున్న వారు నవ్వుకున్నారు. ‘గత యాసంగిలో మే 2 వరకు 7,500 మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నాం. కానీ ఈ సారి ఇప్పటికే 22 వేల మెట్రిక్ టన్నులు కొన్నాం.. అంటే ఎంత ఎక్కువ కొన్నామో అర్థం చేసుకోండి’ అని కాంగ్రెస్ నాయకులకు మంత్రి హితవు పలికారు. ఒక మంత్రిని కలిసేందుకు వచ్చినపుడు అన్ని తెలుసుకుని రావాలని, ఏమీ తెలుసుకోకుండా వచ్చి అడిగితే ఎట్లని మంత్రి ఎదురు ప్రశ్నించారు.
కాంగ్రెస్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ.. రైతుల సమస్య కోసం వచ్చి, మంత్రిని ప్రశ్నిస్తే ఆయన అనుచరులు, తెలివి లేకుండా నినాదాలు చేశారని అనడంతో అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకులు పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి, నేరెళ్ల శ్రీనివాస్, వెంకట్, ఆకుల కిరణ్ కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించేందుకు వెళ్లారు. కాంగ్రెస్ నాయకులు వాగ్వివాదానికి దిగారు. కాంగ్రెస్ నాయకులు మంత్రి కాన్వాయ్కి అడ్డుకునే ప్రయత్నం చేయడంతో బీఎస్ఆర్ నేతలు ప్రతి ఘటించారు. ఇరు వర్గాలు ఒకరిని ఒకరు తోసుకున్నారు. మంత్రి గంగుల కలుగజేసుకుని బీఆర్ఎస్ నాయకులకు సర్ధిచెప్పారు. పోలీసులు జోక్యం చేసుకుని కాంగ్రెస్ నాయకులకు సముదాయించడంతో గొడవ సద్దు మణిగింది.
కరీంనగర్, మే 2 (నమస్తే తెలంగాణ): తడిసిన ధాన్యాన్ని ఆరబెడితే తేమ శాతం 20 వరకు వస్తే దానిని కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్లులకు పంపించాలని అధికారులను ఆదేశించినట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. వరుసగా వర్షాలు కురుస్తున్నందున ధాన్యం పూర్తి స్థాయిలో ఆరబెట్టే పరిస్థితి లేకపోవడంతో తేమ శాతం 17 నుంచి 20 వరకు సడలించాలని ఎఫ్‌సీఐ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విజ్ఞప్తి చేసిందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ మండలం బొమ్మకల్, దుర్శేడ్, గోపాల్పూర్ గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను, తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అకాల వర్షాలతో ఈ సారి మొట్టమొదటి సారిగా వందకు వంద శాతం పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు.