ఖమ్మం, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ విద్యానగర్: ఎమ్మెల్సీ కవితను సీఎం కేసీఆర్ బిడ్డగా కాకుండా తెలంగాణ ఆడబిడ్డగా చూడాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ అర్వింద్, ఎమ్మెల్సీ కవిత మధ్య వివాదాన్ని రాజకీయ కోణంలోనే చూడాలని, కులానికి అంటగట్టడం మంచిది కాదని స్పష్టంచేశారు. అర్వింద్ మున్నూరుకాపు అయినంత మాత్రన మున్నూరుకాపులపై జరిగిన దాడిగా కొన్ని సంఘాలు ఎగదోయడం మంచిది కాదని హితవు చెప్పారు. అర్వింద్ హుందాగా మాట్లాడాలని, ఆడబిడ్డపై వ్యంగ్యంగా మాట్లాడటం మంచిది కాదని అన్నారు.
అర్వింద్ భాష మార్చుకో: ఎంపీ వద్దిరాజు
ఎంపీ ధర్మపురి అర్వింద్ తన భాష మార్చుకోవాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర హితవు చెప్పారు. సీఎం కేసీఆర్పై, ఆయన కుటుంబసభ్యులపైనా అవాకులు చవాకులు పేలితే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు. శనివారం ఆయన ఖమ్మంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. అర్వింద్ ఉపయోగించే భాష జుగుప్సాకరంగా, అత్యంత హేయంగా ఉన్నదని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్య జరిగే వివాదాన్ని కులానికి అంటగట్టడం తగదని హితవు చెప్పారు. మున్నూరుకాపు సంఘం సమావేశాలకు ఏనాడూ రాని అర్వింద్ తనకు ఎదురైన ప్రతిఘటనను కులానికి ఆపాదించడం విడ్డూరమని అన్నారు. అర్వింద్ వ్యవహారశైలి చూస్తుంటే బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయన్న అనుమానం కలుగుతున్నదని చెప్పారు.