విద్యానగర్/బొల్లారం, సెప్టెంబర్ 5 : ‘ఎల్ఐసీ మా కుటుంబ సంస్థ. ఇందులోని ఏజెంట్లు, ఉద్యోగులకు టీఆర్ఎస్ అండగా ఉంటుంది. ఇది వ్యక్తుల సంస్థ కాదు.. ఒక వ్యవస్థ. సంస్థ ఏజెంట్లు, ఉద్యోగుల పోరాటంతో కేంద్రం తప్పకుండా దిగివస్తుంది. వారు చేసే పోరాటానికి మా సంపూర్ణ మద్ద తు ఉంటుంది. ఢిల్లీలో జరుగనున్న ఆందోళనకు వెళ్లేవారిని సొంత ఖర్చులతో పంపిస్తా’ అని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు. లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా – జేఏసీ అధ్వర్యంలో రాష్ట్రంలో సోమవారం పలుచోట్ల ఆందోళనలు నిర్వహించారు.
కరీంనగర్ మంకమ్మతోటలోని ఎల్ఐసీ-2 కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో మంత్రి పాల్గొని, సంఘీభావం ప్రకటించారు. ఎల్ఐసీ ఒక సేవా సంస్థ అని, అలాంటి సంస్థనూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రోడ్డు మీదకి తీసుకొచ్చిందని మండిపడ్డారు. ఎల్ఐసీ ఒక బ్రాండ్ అని, అందుకే సీఎం కేసీఆర్ రైతులకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎల్ఐసీ ద్వారా బీమా సౌకర్యం కల్పించారని గుర్తుచేశారు. పేదల సంపాదనను కేంద్రం గద్దల్లాంటి పెద్దలకు పంచి పెడుతున్నదని, జీఎస్టీ ద్వారా వచ్చిన సంపదను అంబానీ, అదానీలకు పంచుతున్నదని ధ్వజమెత్తారు.
తిరుమలగిరిలో వంటావార్పు
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే ముంబై సెంట్రల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (లియాఫీ) సికింద్రాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి హెచ్చరించారు. తిరుమలగిరి ఎల్ఐసీ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో భాగంగా వంటా వార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాలసీదారులపై జీఎస్టీని ఎత్తివేయాలని, పాలసీ లోన్లపై వడ్డీ రేటు తగ్గించాలని, ఐదేండ్లు పైబడిన పాలసీలను పునరుద్ధరించాలని, ఏజెంట్ల సంక్షేమానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లియాఫీ జాతీయ స్థాయి నాయకులు బీఎన్ చారి, జోనల్ అధ్యక్షుడు కౌటికే విఠల్, డివిజన్ అధ్యక్షుడు రామస్వామి, ఆల్ ఇండియా మహిళా అధ్యక్షురాలు హేమలత, సీడబ్ల్యూఏ కార్యదర్శులు సోమనర్సయ్య, రవీందర్‌రెడ్డి, తిరుమలగిరి బ్రాంచ్ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, కార్యదర్శి శ్రీనివాసులు, కోశాధికారి ప్రకాశ్‌రావు, సీనియర్ ఏజెంట్లు బాలగంగాధర్, ఎం పరశురామ్, కిరణ్‌కుమార్, పరంజ్యోతి పాల్గొన్నారు.