కరీంనగర్ : కరీంనగర్లో నిర్మిస్తున్న టీటీడీ శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణం తొలి కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. నిర్మాణంలో భాగంగా సోమవారం తిరుమల ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితుల చేతుల మీదుగా మూలవిరాట్టు ఉండే ప్రాంతంలో భూకర్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Ganugla), టీటీడీ(Ttd) జేఏవో వీరబ్రహ్మయ్య, సంబంధిత అధికారులు శనివారం ఏర్పాట్లను పరిశీలించారు.
మంత్రి మాట్లాడుతూ కరీంనగర్(Karimnagar)లోని పద్మ నగర్లో 10 ఎకరాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు TTD Board) రూ. 20 కోట్లతో ఆలయాన్ని నిర్మిస్తుందన్నారు. రాష్ట్రానికి ఒక ఆలయాన్ని మాత్రమే టీటీడీ సాధారణంగా నిర్మిస్తుందని, రాజధాని హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఇప్పటికే టీటీడీ ఆలయాన్ని నిర్మించిందని గుర్తు చేశారు. కరీంనగర్లో శ్రీవారి ఆలయం కావాలని తాను, మాజీ ఎంపీ బి వినోద్ కుమార్, తెలంగాణ టీటీడీ అడ్వయిజరీ బోర్డ్ చైర్మన్ భాస్కర్ రావ్ కోరిక మేరకు సీఎం కేసీఆర్( CM KCR) టీటీడీకి లేఖ రాశారని వివరించారు.
లేఖకు స్పందించిన టీటీడీ ఆలయ నిర్మాణానికి అనుమతులిస్తూ స్థలం కేటాయించాలని కోరిందని తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు కరీంనగర్లో 10 ఎకరాలను ప్రభుత్వం ఆలయానికి స్థలం కేటాయించిందని వెల్లడించారు. శ్రీవారి ఆలయానికి 30 నుంచి 40 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనాలున్నాయని, ఇందులో టీటీడీ రూ. 20 కోట్లు ఇస్తుందన్నారు. మిగతా నిధులను భక్తుల సహకారంతో సమకూరుస్తామన్నారు.
ఈనెల 31న భూమిపూజ ప్రారంభించుకుని ఏడాదిన్నరలో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. వైఖానస ఆగమ శాస్త్రప్రకారం కరీంనగర్లో టీటీడీ ఆలయాన్ని నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. 31న ఉదయం 7.20 గంటలకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరుల సమక్షంలో భూమిపూజ, సాయంత్రం శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తామన్నారు, ఈవేడుకలకు ప్రత్యేకంగా మూడు గజరాజులు తరలివస్తున్నాయని వెల్లడించారు.