కరీంనగర్ : బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ఒకేచోట పోటీ చేయాలని, ఓటమి భయంతోనే రెండు చోట్ల పోటీ చేస్తానని చెబుతున్నాడని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula )విమర్శించారు. దమ్ముంటే గజ్వేల్‌లో ఒకే చోట పోటీ చేయాలని రెండు చోట్ల చేయాల్సిన అవసరం ఎందుకని ప్రశ్నించారు. శుక్రవారం కొత్తపల్లి మండలం చింతకుంటలో జరిగిన బీఆర్ఎస్ యువత ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి గంగుల పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేస్తానన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఈటలకు దమ్ముంటే గజ్వేల్‌లో మాత్రమే కేసీఆర్ పై పోటీ చేయాలని, హుజురాబాద్‌లో కూడా బరిలో నిలుస్తానని చెప్తున్నాడంటే ఓటమి భయంతోనే అలా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ బీఫారాలు ఢిల్లీలో ఒకే చోట సిద్ధమవుతాయని, ఈ రెండు పార్టీలు కలిసే ఉంటాయని మంత్రి గంగుల ఆరోపించారు.
బీజేపీకి తెలంగాణలో గుండు సున్నా వస్తుందని, ఆ భయంతోనే ఈటల రాజేందర్ రెండు చోట్ల పోటీ చేస్తానని చెబుతున్నాడు. మతతత్వ పార్టీలకు, భూ కబ్జాలకు పాల్పడే పార్టీలకు అధికారం ఇవ్వొద్దని కోరారు. ఆంధ్రానేతలపై మరో సారి మంత్రి గంగుల కమలాకర్ విరుచుకపడ్డారు. వైఎస్ షర్మిల, కేఏ పాల్, కేవీపీ రామచందర్ రావు, కిరణ్ కుమార్ రెడ్డిలకు తెలంగాణాలో ఏం పని అంటూ ప్రశ్నించారు. వారిని అసలే నమ్మొద్దని బీజేపీ ముసుగులో వచ్చి తెలంగాణను తిరిగి ఆంధ్రాలో కలుపాలని చూస్తున్నారని మండిపడ్డారు. కరీంనగర్ ఎంపీ, బీజేపీ నేత బండి సంజయ్ చేస్తున్న ఆరోపణలను పట్టించుకోమని తేల్చి చెప్పారు.