కరీంనగర్ : తెలంగాణలో హైదరాబాద్(Hyderabad) తరువాత గొప్ప నగరంగా రూపు దిద్దుకుంటున్న కరీంనగర్(Karimnagar)లో సినిమా విజయోత్సవాలను జరుపుకోవడం అభినందనీయమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అన్నారు. గురువారం కరీంనగర్లో నిర్వహిస్తున్న దసరా సినిమా(Dasara Cinema) విజయోత్సవ సభ పోస్టర్(Poster)ను మంత్రి ఆవిష్కరించి మాట్లాడారు.
తెలంగాణ కుటుంబ నేపథ్యం, బంధాలు అనుబంధాల గురించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల కు చెందిన వేణు నిర్మించిన బలగం(Balagam) సినిమా విజయవంతమై కరీంనగర్లో విజయోత్సవ సభ నిర్వహించారని గుర్తు చేశారు. సింగరేణి బొగ్గు గని జీవితాల నేపథ్యంతో తీసిన దసరా సినిమా విజయవంతం అవడం ఈ సినిమా విజయోత్సవ సభ కరీంనగర్ లో జరపడం అభినందనీయమని పేర్కొన్నారు.
అభివృద్ధి చెందుతున్న కరీంనగర్లో సినిమా విజయోత్సవ సభలను కరీంనగర్లో జరుపుకోవాలని కోరుకుంటున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో కరీంనగర్ టూరిజం స్పాట్ గా మారనుందని ఆయన వెల్లడించారు. తెలంగాణ యాసతో నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేశ్ నటించిన ‘దసరా ’ చిత్రం విజయోత్సవ సభ కరీంనగర్లోని స్థానిక ఎస్సారార్ డిగ్రీ కళాశాలలో సాయంత్రం నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, నాయకులు మెచినేని అశోక్ రావు, రాజేశ్వర రావు, కర్ర సూర్య శేఖర్, శ్రేయాస్ మీడియా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.