హైదరాబాద్ : రాష్ట్రంలో క్రమశిక్షణకు మారుపేరుగా మహాత్మా జ్యోతిరావుపూలే గురుకులాలు నిలువడం అభినందనీయయమని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో శనివారం బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ (MJPT BCWREIS) కరీంనగర్ ఉమ్మడి జిల్లా క్రీడాపోటీల ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై.. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పత్రి గురుకులంలో విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తుందన్నారు.
తాము చదువుకున్న సందర్భాల్లో ఇలాంటి సౌకర్యాలు ఎన్నడూ చూడలేదన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 281 బీసీ గురుకులాలలను ఏర్పాటు చేసి 1.51లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తూ.. ఒక్కో విద్యార్థిపై రూ.1.25లక్షల వరకు ఖర్చు చేస్తుందన్నారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని.. తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని చేయాలన్నారు. బీసీ బిడ్డలకు సేవలందించేందుకు బీసీ సంక్షేమశాఖ మంత్రిగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు గంగుల ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్ జిల్లాలోనే రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
గురుకులంలో చదువుకున్న ప్రతి విద్యార్థి ఉన్నతంగా ఎదిగినప్పుడే సంతోషంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మానకొండూరు, చొప్పదండి ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, డీవైఏవో కే రాజవీరు, ఆర్ సీఓ గౌతంరెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజమనోహర్ రావు పాల్గొన్నారు. బాలికల విభాగంలో వేములవాడ బీసీ వెల్ఫేర్ గురుకుల విద్యార్థులు ఓవరాల్ చాంపియన్ షిప్‌ను కైవసం చేసుకోగా.. బాలుర విభాగంలో సైదాపూర్ బీసీ గురుకుల విద్యార్థులు ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను సాధించారు. అథ్లెటిక్స్‌తో పాటు క్యారమ్స్, చెస్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, టెన్నికాయిట్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ విద్యార్థులతో స్టెప్పులు వేశారు.