హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): మెరుగైన పర్యవేక్షణ, పనితీరు, జవాబుదారీతనం, పారదర్శకతను పెంపొందించే విధంగా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభా గం పునర్వ్యవస్థీకరణ పూర్తయింది. నూతన పీఆర్ ఇంజినీరింగ్ కార్యాలయాలు శనివారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ కార్యాలయాలను ఈ నెల 9 నుంచి 12 వరకు ప్రారంభించాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వరంగల్‌లో మూడు కార్యాలయాలను శనివారం ఉదయం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఉప్పల్‌లో హైదరాబాద్ క్వాలిటీ కంట్రోల్ ఎస్ఈ కార్యాలయాన్ని, ఖైరతాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టెరిటోరియల్ సీఈ కార్యాలయాలను ప్రారంభించనున్నారు.
పంచాయతీరాజ్ విభాగంలో ప్రభుత్వం ఇంజినీరింగ్ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించింది. క్షేత్రస్థాయిలో వాస్తవ పనులకు అనుగుణంగా అధికారులు, సిబ్బంది ఉండే విధంగా కొత్త పోస్టులను సృష్టిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. పీఆర్ ఇంజినీరింగ్ అధికారులకు పరిపాలనపరమైన అనుమతుల ఇచ్చే అధికారాన్ని ఇచ్చారు. దీంతో పీఆర్ ఇంజినీరింగ్ విభాగంలో కొత్తగా 740 పోస్టులు రానున్నాయి. తెలంగాణలో 33 జిల్లాలు ఏర్పాటు చేయడంతో పంచాయతీరాజ్ రోడ్ల పర్యవేక్షణకు ఎస్ఈ, క్వాలిటీ కంట్రోల్ విభాగాలకు కార్యాలయాలు, అధికారులను ఏర్పాటు చేసేందుకు కొత్త భవనాలు, పోస్టులు వచ్చాయి. జిల్లాల్లో రోడ్లను, ఇతర పీఆర్ పనులను పర్యవేక్షించడానికి సీఈలను ఏర్పాటుచేశారు. పీఆర్ రోడ్ల కిలోమీటర్లు పెరిగినా గతంలో ఉన్న సిబ్బంది, అధికారులే ఉన్నారు. దీంతో జిల్లాలు, మండలాలకు అనుగుణంగా పీఆర్ ఇంజినీరింగ్ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించారు. కొత్తగా మంజూరైన పోస్టుల్లో క్వాలిటి కంట్రోల్ విభాగాలను ఏర్పాటు చేశారు.
సీసీ రోడ్లు : 3,747
బీటీ రోడ్లు : 24,964
మెటల్ రోడ్లు : 8,511
మట్టి, మొరం రోడ్లు: 30,304
మొత్తం : 67,526
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులకు రోడ్లకు పరిపాలనపరమైన అనుమతి ఇచ్చే అధికారాన్ని ప్రభుత్వం ఇచ్చింది. ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్ (ఎఫ్డీఆర్), క్రాస్ డ్రైనేజ్ (సీడీ) వర్క్స్, అత్యవసర సమయాల్లో పనులు చేపట్టడానికి ఆర్థికపరంగా అనుమతి ఇచ్చే అధికారాన్ని ఇచ్చింది. సీడీ వర్స్, ఎఫ్డీఆర్ పనులకు కూడా అనుమతి ఇచ్చే అధికారాలను కల్పించారు. డీఈఈ నుంచి ఈఎన్సీ వరకు పరిపాలనపరమైన అనుమతులను ఇచ్చారు.