Minister Errabelli Dayakar Rao | తెలంగాణ సాధనలో అమరవీరుల పాత్ర కీలకమైనదని.. వారి ప్రాణత్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా జనగామ జిల్లా కలెక్టరేట్లోని సమావేశంలో నిర్వహించిన అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 9 ఏండ్లలో జరిగిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని కొనియాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలైన ఇంటింటికీ గృహలక్ష్మీ, దళితబంధు, బీసీ రుణాలు, తదితర పథకాల్లో అమరవీరుల కుటుంబాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్కు ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి సూచించారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో విజయవంతంగా జరుపుకున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ రాక ముందు వచ్చిన తర్వాత ఉన్న తేడాలను వివరిస్తూ గత 22 రోజులుగా ప్రజల్లో అవగాహన కల్పించామని చెప్పారు. స్వతంత్ర ఉద్యమంలో మహాత్మాగాంధీ రీతిలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారని అన్నారు. అంతకుముందు అమరవీరుల స్తూపానికి మంత్రి ఎర్రబెల్లి నివాళులు అర్పించారు. అనంతరం అమరవీరుల కుటుంబసభ్యులను మంత్రి సన్మానించారు. కార్యక్రమం అనంతరం వారితో కలిసి భోజనం చేశారు.
తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి స్వగ్రామమైన జనగామ జిల్లా దేవరుప్పుల మండలం గొల్లపల్లి గ్రామంలో శ్రీకాంతాచారి విగ్రహానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం నూతనంగా నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరించారు. మలిదశ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఏం కావాలని కోరుకుని బలిదానాలకు పాల్పడ్డారో.. అవన్నీ కూడా సీఎం కేసీఆర్ వల్ల సాధ్యమయ్యాయని అన్నారు. అమరవీరుల కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తెలిపారు. శ్రీకాంతాచారి కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చి అండగా నిలబడిందని గుర్తు చేశారు. అలాగే శ్రీకాంతాచారి నానమ్మకి పోయిన స్థానిక సంస్థల సమయంలో ఎంపీటీసీగా అవకాశం ఇచ్చి వారిని గౌరవించామని తెలిపారు. గొల్లపల్లిలో శ్రీకాంతాచారి పేరిట ఆడిటోరియం కూడా నిర్మిస్తానని తెలిపారు.