మహబూబాబాద్ : వరద బాధిత కుటుంబాలను ఆదుకుంటామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని పెద్ద వంగర మండలం, పోచంపల్లిలో వరదలో కొట్టుకుపోయి చనిపోయిన అన్నదమ్ములు పిండి యాకయ్య, పిండి శ్రీనివాస్ కుటుంబాలను మంత్రి పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపి, బాధిత కుటుంబాలకు 25 వేల రూపాయల ఆర్థిక సాయం చేశారు. అలాగే ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఇప్పిస్తానని మంత్రి వారి కుటుంబాలకు హామీ ఇచ్చారు.
కాగా, భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలు అధైర్య పడొద్దని.. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు. ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో వరదల (Floods) పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు, సంబధిత అధికారులతో మాట్లాడుతూ నీట మునిగిన ప్రాంతాల పరిస్థితులపై ఆరా తీస్తున్నారు.
వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వరదల్లో చిక్కుకుపోయిన వారిని రక్షిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజలు అధైర్య పడొద్దు, ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టిందన్నారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఆహారం, నీరు అందించడంతోపాటు పునరావాసం ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.