హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆందోళన ఘటన దురదృష్టకరమని, ఈ ఆందోళనలో వరంగల్ యువకుడు రాకేశ్ మృతి తనను కలిచివేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎంతో భవిష్యత్ ఉన్న యువత గాయపడడం ఆవేదన కలిగిస్తున్నదని చెప్పారు. మృతుడి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశిస్తున్నట్లు చెప్పారు. మృతుడి కుటుంబానికి, క్షతగాత్రులకు ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
కేంద్ర సర్కారు తీసుకున్న ఒక ఆనాలోచిత, అపరిపక్వ, అసంబద్ధ ఆలోచనవల్లే ఈ అనర్థం జరిగిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. దేశాన్ని రక్షించే త్రివిధ దళాల్లో కొత్తగా యువతను తీసుకునేందుకు తెచ్చిన అగ్నిపథ్ పథకమే అర్థంలేని విధంగా ఉందని వ్యాఖ్యానించారు. దేశస్థాయిలో కేవలం 46 వేల మందిని తీసుకునేందుకు ఇంత పెద్ధ రాద్ధాంతం అవసరమా? అని ప్రశ్నించారు. మొన్న నల్ల చట్టాలతో రైతుల ఉసురుపోసుకున్న కేంద్రం.. నేడు అగ్నిపథ్ పథకంతో యువతను రోడ్డున పడేసిందని మండిపడ్డారు. ఇంతాచేసి అల్లర్లలో పార్టీల పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తంచేస్తూ బీజేపీ నాయకులు యువతను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
దేశవ్యాప్తంగా జరుగుతున్న అన్ని ఆందోళనల వెనుకా పార్టీలే ఉన్నాయా?.. కేంద్రంలో బీజేపీ చేతగానితనాన్నిపార్టీల మీద రుద్దడం న్యాయమా? అని ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించారు. మోదీ పాలనలో దేశంలో నిరుద్యోగ శాతం 5.6 శాతం నుంచి 7.83 శాతానికి పెరిగిందన్నారు. వేతనాలు, పింఛన్ల భారాన్ని తగ్గించుకునేందుకే కేంద్ర సర్కారు తీసుకున్న దిక్కుమాలిన నిర్ణయమే ఈ అగ్నిపథ్ స్కీం అని మండిపడ్డారు. యువతలో ఆందోళనకు కారణమైన ఈ నిర్ణయాన్ని కేంద్ర సర్కారు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, నిరుద్యోగులు సంయమనం పాటించాలని, కేంద్రం వైఖరిపై శాంతియుతంగా నిరసన తెలుపుదామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు.