హైదరాబాద్ : రాష్ట్రంలోని రోడ్లుకు మంజూరైన నిధులతో రోడ్లన్నీ అద్దంలా మెరువాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్(CM KCR) ఆదేశాల ప్రకారం వారం రోజుల్లో టెండర్లు పూర్తి చేసి గ్రౌండింగ్ చేయాలని అన్నారు.
పంచాయతీరాజ్ గ్రామీణ రోడ్ల నిర్వహణ పనులపై సంబంధిత అధికారులతో గురువారం హైదరాబాద్ లోని పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం కార్యాలయంలో ఎస్ఇ లు, సీఇలు, ఇతర అధికారులతో నిర్వహించిన సమీక్ష(Review)లో మంత్రి మాట్లాడారు.‘ కాంట్రాక్టర్లు రావడం లేదని కారణాలు చెప్పొద్దు. అధికారుల్లో అలసత్వాన్ని సహించబోం. నిర్లక్ష్యం వహించే అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవని’ అన్నారు. ఎక్కడైనా సమస్యలుంటే సంబంధిత నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్దేశిత సమయంలో పనులు పూర్తి కావాలన్నారు.
రాష్ట్రంలో మొత్తం రూ.2,687 కోట్ల అంచనా వ్యయంతో 6254 కి. మీ. మేర 3010 బీటీ రోడ్లు(BT Roads) మంజూరు అయ్యాయని వివరించారు. రద్దైన పనులు వేరే నియోజకవర్గాలకు బదిలీ చేయాలని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకునే అధికారులు కొందరు సమర్థవంతంగా పని చేస్తున్నారని కొనియాడారు. ఆరు నెలల్లోనే ఆయా పనులన్నీ పూర్తి చేయాలని వెల్లడించారు.
అధికారులు కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయని, ఆ క్రెడిట్ కూడా మీకే దక్కుతుందని, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని మంత్రి అన్నారు.ఈ సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఈఎన్సీ సంజీవరావు, సీఈ సీతారాములు , అధికారులు పాల్గొన్నారు.