పర్వతగిరి : కాకతీయులు కట్టించిన గుడిని పునః ప్రతిష్టాపన చేసి మన చరిత్రను కాపాడే పవిత్ర కార్యాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఈ నెల 26, 27, 28 తేదీల్లో పర్వతగిరిలో శివాలయం పునః ప్రతిష్టకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. వేడుకల నిర్వహణపై సోమవారం పర్వతగిరిలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పునః ప్రతిష్ట సందర్భంగా వచ్చే భక్తులకు వసతుల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అందరూ తగిన జాగ్రత్త తీసుకోవాలన్నారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు సమన్వయంతో పని చేసి ఈ దైవ కార్యాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భక్తుల కోసం భోజన, తాగునీరు వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు. రిజర్వాయర్‌లో పడవ ప్రయాణం కూడా ఉందని, భక్తులు కుటుంబంతో వచ్చి శివున్ని దర్శించుకుని, సరదాగా బోటింగ్ చేయవచ్చన్నారు. బోటింగ్ వసతులను పరిశీలించారు. వేలాదిగా తరలివచ్చే భక్తుల వాహనాల కోసం అవసరమైన మేరకు పార్కింగ్ వసతి కల్పించినట్లు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తెలిపారు. పర్వతగిరి గ్రామం నుంచి శివాలయం వరకు రవాణా సదుపాయం ఏర్పాటు చేశామన్నారు. వృద్ధులు, వికలాంగులు గుట్ట మీదకు వెళ్లి దర్శించుకునేందుకు వీలుగా వాహనాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
పునః ప్రతిష్టాపన గొప్పగా ఉండేలా లైట్లు, మొక్కలు, వసతులతో సుందరీకరణ చేశామన్నారు. కార్యక్రమంలో మూడు రోజుల కార్యక్రమం సమన్వయ కర్త వందేమాతరం రవీందర్ రావు, మిషన్ భగీరథ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస రావు, మిషన్ భగీరథ సూపరింటెండెంట్ ఇంజినీర్ మల్లేశం, విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సునీత, ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, డీఆర్డీవో సంపత్ రావు, పంచాయతీ రాజ్ ఈఈ శంకరయ్య, జెడ్పీ సీఈఓ సాహితీ మిత్ర, ఆర్డీవో మహేందర్, పర్యాటక శాఖ జిల్లా అధికారి శివాజీ, డీపీవో కల్పన, స్థానిక సర్పంచ్ మాలతీ సోమేశ్వర రావు, ఎంపీటీసీలు మాడుగుల రాజు, బొట్ల మహేంద్ర వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.