హైదరాబాద్ : తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలని పరితపించిన మహానుభావుడు విద్యాసాగర్ రావు అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జల వనరుల నిపుణులు, తెలంగాణ ముద్దు బిడ్డ, ఉద్యమకారుడు అర్ విద్యాసాగర్ రావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం జరిగిందన్నారు. అందులో నీటి కేటాయింపులపై, నీటి దోపిడీపై తన సునిశిత అధ్యయనం ద్వారా ప్రజలని చైతన్యం చేశారని గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎకరం నీటితో తడిచి, రైతు కన్నీళ్లును తుడిచేందుకు అహరహం కృషి చేశారని ప్రశంసించారు.సీఎం కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టుల రూపకల్పనకు విద్యాసాగర్ రావు అనుభవం ఉపయోగపడిందన్నారు.